Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు శుభవార్త.. ఏఐపై ఎంఐటీ కీలక నివేదిక!

ఏఐతో ఉద్యోగాలు పోతాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఎంఐటీ ఈ నివేదిక ద్వారా వారందరికీ ఊరటనిచ్చింది

By:  Tupaki Desk   |   10 Feb 2024 12:30 AM GMT
ఉద్యోగులకు శుభవార్త.. ఏఐపై ఎంఐటీ కీలక నివేదిక!
X

నూతన టెక్నాలజీలు.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) తదితరాల ప్రవేశంతో చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కృత్రిమ మేథ (ఏఐ)తో చాలామంది తమ ఉద్యోగాలను పోగొట్టుకుంటారని.. ఉద్యోగుల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందని అంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

అయితే ప్రపంచంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ.. మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ).. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పై కీలక నివేదికను వెలువరించింది. ఇప్పటికిప్పుడు ఏఐ వల్ల ఉద్యోగాలు పోవని వెల్లడించింది. కంపెనీలు ఏఐని ప్రవేశపెట్టడం బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఎంఐటీ తెలిపింది. ఉద్యోగులను నియమించుకోవడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే ఏఐని ప్రవేశపెట్టడానికి చాలా ఖర్చు అవుతుందని వెల్లడించింది. దీంతో కంపెనీలు ఏఐని ప్రవేశపెట్టే సాహసం చేయవని అభిప్రాయపడింది.

ఏఐతో ఉద్యోగాలు పోతాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఎంఐటీ ఈ నివేదిక ద్వారా వారందరికీ ఊరటనిచ్చింది. ఇప్పటికిప్పుడు ఉద్యోగుల స్థానంలో ఏఐని నియమించుకోవటం సాధ్యం కాకపోవచ్చునని ఎంఐటీ తన నివేదికలో అభిప్రాయపడింది. చాలా కంపెనీలకు అది ఖర్చుతో కూడుకున్నది కావడమే ఇందుకు కారణమని తెలిపింది.

అమెరికాలో ఉద్యోగుల స్థానంలో కృత్రిమ మేధని ప్రవేశపెట్టడం సాధ్యమేనా? అనే అంశంపై ఎంఐటీ ఈ తాజా అధ్యయనం నిర్వహించింది. చాలా సంస్థలకు ఏఐని ప్రవేశపెట్టడం కంటే.. ఆ స్థానంలో ఉద్యోగులను కొనసాగిస్తేనే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపింది. ఈ పరిస్థితి మరి కొన్ని దశాబ్దాల పాటు ఉంటుందని ఎంఐటీ వెల్లడించింది. దీంతో ఇప్పటికిప్పుడు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం అక్కర్లేదని స్పష్టం చేసింది. ‘కంప్యూటర్‌ విజన్‌’ అనే ఏఐ ఆటోమేషన్‌ సిస్టమ్‌ పై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు ఎంఐటీ తెలిపింది.

కాగా ఏఐతో కేవలం 23 శాతం ఉద్యోగాలను మాత్రమే రీప్లేస్‌ చేయొచ్చని ఎంఐటీ నివేదిక తెలిపింది. ఇది కంపెనీలకు ఖర్చులపరంగా కలిసొస్తుందని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది.

కంప్యూటర్‌ విజన్‌ అమలుకు వెచ్చించాల్సిన ధర ఏటా 20 శాతం తగ్గుతుందని అనుకున్నా.. అది కంపెనీలకు అందుబాటు ధరకు వచ్చేందుకు దశాబ్దాలు పడుతుందని ఎంఐటీ తన నివేదికలో అభిప్రాయపడింది. ఈ విషయం చెప్పడానికి తాము గతంలో వచ్చిన అధ్యయనాలు ఆర్థిక, సాంకేతికపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించింది. కేవలం ఏఐ సామర్థ్యం, దాని పనితీరును మాత్రమే అంచనా వేసి ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామని పేర్కొంది.

అయితే ఉద్యోగ ప్రపంచంలో మార్పులకు మాత్రం ఏఐ కచ్చితంగా కారణమవుతుందని ఎంఐటీ నివేదిక వెల్లడించింది. స్వల్ప కాలంలో కొంతమంది ఉద్యోగాలు పోతాయని పేర్కొంది. అలాగే మరికొంత మంది బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయని వివరించింది.

రానురానూ ఏఐ వ్యవస్థల అభివృద్ధికి అయ్యే ఖర్చు తగ్గుతుందని ఎంఐటీ నివేదిక వెల్లడించింది. అయితే, వాటిని కంపెనీలు విస్తృత స్థాయిలో అమలు చేసే స్థాయికి రావడానికి మాత్రం చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడింది.