Begin typing your search above and press return to search.

జీవితంలో చేదు జ్ఞాపకాలు ఉన్నాయా?... మీకో గుడ్ న్యూస్!

ప్రధానంగా ఏఐ ఎంట్రీతో ఇది మరింత బలపడింది. ఈ నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు.

By:  Tupaki Desk   |   20 Aug 2024 7:51 AM GMT
జీవితంలో చేదు జ్ఞాపకాలు ఉన్నాయా?... మీకో గుడ్ న్యూస్!
X

రోజు రోజుకీ సైన్స్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనిషి యాంత్రంలా మారిపోతున్నాడా.. మనిషికీ యంత్రానికీ తేడా లేని రోజులు వచ్చేశాయా.. అనే చర్చ ఇప్పటికే మొదలైంది. ప్రధానంగా ఏఐ ఎంట్రీతో ఇది మరింత బలపడింది. ఈ నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు.

అవును... తాజాగా అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు మెదడు కణాలకు కొరత అనేదే లేకుండా రోజువారీ ఎదురయ్యే జ్ఞాపకాలను ఎలా నిక్షిప్తం చేసుకోగలుగుతున్నాడు అనే రహస్యానికి సంబంధించిన గుట్టు విప్పారు. ఈ సందర్భంగా మెదడు, అందులోని జ్ఞాపకాల నిక్షిప్తత మొదలైన విషయాలపై కీలక విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... మనిషి గాఢ నిద్రలో ఉన్న సమయలో కొన్ని సార్లు మెదడులోని హిప్పోక్యాపస్ అనే భాగంలో నిర్దిష్ట ప్రదేశాలు క్రియారహితంగా మారుతున్నాయని.. దీనివల్ల న్యూరాన్లు రీసెట్ అవుతున్నాయని వారు తేల్చారు. ఫలితంగా అవే వ్యవస్థలు, అవే న్యూరాన్లు నెక్స్ట్ డే అభ్యాస ప్రక్రియలకు ఉపయోగించుకోవడానికి వీలవుతోందని తెలిపారు.

రోజంతా ఓ మనిషి నేర్చుకున్న విషయాలు, ఎదురైన అంశాలపై మెదడు కణాలు దృష్టిసారిస్తాయి. ఈ నేపథ్యంలోనే అనేక అంశాలతో ముడిపడిన విషయాలను పునఃసృష్టిస్తాయి. ఫలితంగా జ్ఞాపకాల నిక్షిప్తానికి సహాయపడతాయి. ఈ ప్రక్రియనే... "మెమరీ కన్సాలిడేషన్" అంటారు. దీనివల్ల జ్ఞాపకాలు.. మెదడులోని కార్టెక్స్ అనే పెద్ద ప్రాంతంలో నిల్వ ఉంటాయి.

ఈ ప్రక్రియకు ప్రధానంగా కార్టెక్స్, హిప్పోక్యంపస్.. ఇవి రెండూ ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ సమయంలోనే స్వల్పకాల జ్ఞాపకాలను దీర్ఘకాలం గుర్తుంచుకునేలా వాటిని కారెక్ట్స్ కు హిప్పోక్యాంపస్ బదలాయిస్తుంది. తాజాగా ఈ విషయాన్ని తెలుసుకోవడం వల్ల సరికొత్త చికిత్సలకు వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇందులో భాగంగా మెమరీ కన్సాలిడేషన్ ప్రక్రియలో మార్పులు చేర్పుల ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకునే వ్యవస్థలను రూపొందించొచ్చని పరిశోధకులు వివరించారు. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల వంటివారిలో జ్ఞాపకశక్తి సంబంధ లోపాలు తలెత్తినప్పుడు.. ఈ తరహా వ్యవస్థలతో చికిత్స చేయవచ్చని వారు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే... మనిషి మెదడులోని ప్రతికూల, భయానక, చేదు జ్ఞాపకాలను చెరిపేసే మార్గాలను అన్వేషించడానికి ఈ పరిశోధనను ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. దీంతో.. మనిషి మెదడులో నిక్షిప్తమై ఉన్న చేదు జ్ఞాపకాలను చెరిపేసే ప్రక్రియ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.