ఆ రెండు రాష్ట్రాల్లోనూ రేపే ఎన్నికల ఫలితాలు... కారణం ఇదే!
అయితే రెండు రాష్ట్రాల్లో మాత్రం ఆదివారమే ఫలితాలు వెలువడనున్నాయి.
By: Tupaki Desk | 1 Jun 2024 12:52 PM GMTదేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో శనివారం సాయంత్రం 6:30 నుంచి వాటికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సందడి షురూ అయ్యింది! ఇక ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ జూన్ 4నే వెలువడనున్నాయి. అయితే రెండు రాష్ట్రాల్లో మాత్రం ఆదివారమే ఫలితాలు వెలువడనున్నాయి.
అవును... దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ జూన్ 4న వెలువడనుండగా... అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఆదివారమే (జూన్ 2) వెలువడనున్నాయి. ఇందులో భాగంగా జూన్ 2 ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.
ఇక ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా... పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసుల భద్రత నడుమ కౌంటింగ్ జరగనుంది. కాగా... అరుణాచల్ ప్రదేశ్ లో 60, సిక్కింగ్ లో 32 అసెంబ్లీ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ.. 10 అసెంబ్లీ స్థానాల్లో ఏకగ్రీవంగా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక మిగిలిన 50 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఈ 50 స్థానాలకు గానూ 133 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆదివారం వెలువడే ఈ ఫలితాలతో అక్కడ బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుందా.. లేదా అనేది తేలనుంది.
ఇక సిక్కిం విషయానికొస్తే... ఇక్కడ 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. రికార్డ్ స్థాయిలో 80శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడున్న 32 స్థానలకు గానూ సుమారు 146 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక్కడ ప్రధాన పోటీ సిక్కిం క్రాంతి మోర్చా, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య ఉండనుంది!
2019 ఫలితాల విషయానికొస్తే... అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ - 41, ఎన్.పీ.పీ. - 5, కాంగ్రెస్ - 4, ఇతరులు - 10 స్థానాల్లో విజయం సాధించారు. ఇక సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా - 17, సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ - 15 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ ల ప్రాతినిధ్యం శూన్యం!
కాగా... ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పదవీకాలం జూన్ 2 తోనే ముగియనుండటంతో.. దేశవ్యాప్తంగా జరిగే జూన్ 4 కంటే రెండు రోజుల ముందే కౌంటింగ్ ప్రక్రియ మొదలవ్వబోతోంది!