Begin typing your search above and press return to search.

మూడోసారి.. ఆ ముఖ్యమంత్రి ప్రత్యేకత ఇదే!

సెవెన్‌ సిస్టర్స్‌ గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి.. అరుణాచల్‌ ప్రదేశ్‌. చైనాకు సరిహద్దుల్లో ఉంది

By:  Tupaki Desk   |   13 Jun 2024 8:04 AM GMT
మూడోసారి.. ఆ ముఖ్యమంత్రి ప్రత్యేకత ఇదే!
X

సెవెన్‌ సిస్టర్స్‌ గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి.. అరుణాచల్‌ ప్రదేశ్‌. చైనాకు సరిహద్దుల్లో ఉంది. ఈ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 47 స్థానాల్లో విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో పెమా ఖండు వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా పెమా ఖండును తమ నేతగా ఎన్నుకున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తదితరుల సమక్షంలో పెమా ఖండు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా ఉప ముఖ్యమంత్రిగా చౌనా మీన్‌ ప్రమాణస్వీకారం చేశారు.

కాగా గతంలో పెమా ఖండు తండ్రి దోర్జూ ఖండూ కూడా అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేయడం విశేషం. 2016 నుంచి పెమా ఖండు అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోనే అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న వ్యక్తిగా పెమా ఖండు రికార్డులు సృష్టించారు.

2011లో తండ్రి దోర్జూ ఖండూ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందాక పెమా ఖండు రాజకీయాల్లోకి ప్రవేశించారు. నాడు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో నీటి వనరులు, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2016 జూలైలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 36 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు.

2016 సెప్టెంబర్‌ లో తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌ నుంచి వేరుపడ్డారు. అరుణాచల్‌ పీపుల్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన పెమా ఖండు పార్టీని అధికారంలోకి తెచ్చారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 41 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. దీంతో పెమా ఖండు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 అసెంబ్లీ స్థానాలకు 46 చోట్ల బీజేపీని గెలిపించారు. దీంతో మరోసారి పెమా ఖండు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.