శ్రీరాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ దీక్ష గురించి తెలుసా?
ఇందులో భాగంగా... శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి... శిల్పి అరుణ్ యోగిరాజ్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
By: Tupaki Desk | 16 Jan 2024 5:15 AM GMTభారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీరాముని భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం ఈనెల 22న జరగనున్న సంగతి తెలిసిందే. అదేరోజు ఈ నూతన రామాలయంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ సందర్భంగా శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అవును... అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామాలయంలో బాల రాముని విగ్రాహాన్ని చెక్కిన సుప్రసిద్ధ మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి... శిల్పి అరుణ్ యోగిరాజ్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇందులో భాగంగా... బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో అరుణ్ యోగిరాజ్ నెలల తరబడి తన కుటుంబంలోని ఎవరితోనూ మాట్లాడకుండా, ఎంతో దీక్షతో ఈ కార్యాన్ని నెరవేర్చారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. అరుణ్ యోగిరాజ్ రాముని విగ్రహ తయారీలో పూర్తి అంకితభావాన్ని ప్రదర్శించారని తెలిపింది.
ఇదే సమయంలో విగ్రహ నిర్మాణ సమయంలో అరుణ్ యోగిరాజ్ చూపిన ఏకాగ్రత, కనబరిచిన త్యాగం అమోఘమని ఆయన తెలిపారు. బాలరాముని విగ్రహం తయారు చేసే సమయంలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఆయన దూరంగా ఉన్నారని.. చివరికి తన పిల్లల ముఖాలు కూడా చూడలేదని.. ఆఖరికి మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించలేదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు
ప్రస్తుతం సంక్రాంతి సంబరాల్లో ఉన్న శిల్పి అరుణ్ యోగిరాజ్ కుటుంబ సభ్యులు ఈ విషయాలపై స్పందించారు. ఇందులో భాగంగా... అరుణ్ తల్లి సరస్వతి మాట్లాడుతూ... పండుగ రోజున శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ కుమారుని గురించి చేసిన ప్రకటన తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
ఇదే సమయంలో అరుణ్ యోగిరాజ్ భార్య విజేత మాట్లాడుతూ... తన భర్త చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఫలితంగా... తమ జీవితం సార్థకమైందని అన్నారు. తన భర్తను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభినందించడం ఆనందంగా ఉందని తెలిపారు.
కాగా గతంలో... కేదార్ నాథ్ లోని శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఈ క్రమంలోనే తాజాగా అయోధ్య రామమందిరంలో బాలరాముని విగ్రహాన్ని ఆయన రూపొందించారు!