Begin typing your search above and press return to search.

అతిషీ, కేజ్రీ భార్యనే కాదు.. ఢిల్లీ సీఎం రేసులో మరో ఇద్దరు

ప్రకటించిన విధంగా చూస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామాకు సమయం దగ్గర పడుతోంది. రేపు ఈ సమయం వరకు ఆయన వైదొలగాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   16 Sep 2024 6:20 AM GMT
అతిషీ, కేజ్రీ భార్యనే కాదు.. ఢిల్లీ సీఎం రేసులో మరో ఇద్దరు
X

ప్రకటించిన విధంగా చూస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామాకు సమయం దగ్గర పడుతోంది. రేపు ఈ సమయం వరకు ఆయన వైదొలగాల్సి ఉంది. అయితే, ఆయన చెప్పినట్లు చేస్తారా? అనేది కూడా అనుమానంగానే ఉంది. ఒకవేళ వెనక్కుతగ్గితే అది కేజ్రీకే దెబ్బ. ఆయనపై విశ్వసనీయత సన్నగిల్లుతుంది. లేదా నిజంగానే రాజీనామా చేస్తే కేజ్రీ సవాల్ పై నిలిచినవారు అవుతారు. మరి ఆయన స్థానంలో ఎవరు ఢిల్లీ సీఎం అవుతారనేది ఆసక్తికరంగా ఉంది. నిన్నటివరకు మంత్రి అతిషి పేరు మాత్రమే వినిపించగా.. ఇప్పుడు మరో ముగ్గురి పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఎవరు సీఎం కుర్చీలోకి వచ్చినా.. వారు పదవిలో ఉండేది ఫిబ్రవరి వరకే. ఎందుకంటే అప్పటివరకు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలి. కేజ్రీ డిమాండ్ చేస్తున్నట్లుగా మహారాష్ట్రతో పాటే ఎన్నికలు జరిపితే అది నవంబరుతోనే ఢిల్లీ సీఎం పదవీ కాలం ముగుస్తుంది. అంటే.. రెండు నెలలు మాత్రమే.

ముగ్గురు మంత్రులు..

కేజ్రీ రాజీనామా చేస్తే ఢిల్లీ సీఎంగా ముగ్గురు మంత్రులు బాధ్యతలు చేపట్టే చాన్సుంది. వారిలో నిన్నటివరకు అతిషీ పేరు బాగా వినిపించింది. ఆమె కేజ్రీ అరెస్టు అయినప్పటి నుంచి మరింత పాపులర్ అయ్యారు. 41 ఏళ్ల యువ మంత్రి అయిన అతిషీ.. 15 శాఖలను చూస్తున్నారంటేనే ఆమెకు దక్కుతున్న ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుంది. వీటిలో విద్య, ఆర్థిక, ప్రజా పనులు, నీరు, విద్యుత్తు శాఖలున్నాయి. వాగ్ధాటి, మహిళ కావడంతో అతిషీ తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు.

కార్మిక నేత గోపాల్ రాయ్..

కేజ్రీ సర్కారులో మంత్రి గోపాల్ రాయ్.. కిందినుంచి ఎదిగారు. 49 ఏళ్ల గోపాల్ రాయ్‌ విద్యార్థి, కార్మిక రాజకీయాల నుంచి ఎదిగారు. పర్యావరణం, అటవీ, వన్యప్రాణి, అభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖలను చూస్తున్నారు. కార్మిక వర్గాలతో అనుబంధం ఉంది. వారి హక్కులు, పర్యావరణ సమస్యలపై స్పందిస్తుంటారు. కాలుష్య నియంత్రణ ఢిల్లీ ప్రధాన సమస్య. దీనిని గోపాల్ రాయ్ చూస్తున్నారు. అయితే, గతోంలో ఈయనపై ప్రచారంలో ఉండగా కాల్పులు జరిగాయి. పాక్షికంగా పక్షవాతానికి గురయ్యారు.

పాలనా దక్షుడు గహ్లోత్

రవాణా శాఖ మంత్రిగా ఢిల్లీ రాజకీయల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడు కైలాష్ గెహ్లోత్. పరిపాలనా సామర్థ్యం ఈయన సొంతం. కీలకమైన రవాణా శాఖను చూస్తున్నారు. బస్సు సర్వీసుల విస్తరణ, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, రహదారి భద్రత కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. 50 ఏళ్ల కైలాష్ గహ్లోత్.. పాలనా సామర్థ్యంలో మంచి పేరు పొందారు.

కేజ్రీ భార్యకు అవకాశం ఇస్తారా?

సంప్రదాయ పార్టీలను విమర్శించి, ఆయా పార్టీల అవినీతిపై ఉద్యమించి.. సొంతంగా పార్టీ నెలకొల్పిన కేజ్రీవాల్.. ఇప్పుడు వారసత్వ రాజకీయాల బాటలో నడిచి తన భార్య సునీతాను సీఎం చేస్తారా? అనేది తీవ్ర చర్చనీయం అవుతోంది. కేజ్రీ భార్య సునీతా సీఎం రేసులో ఉన్నట్లుగా వస్తున్న కథనాలు నిజమైతే విమర్శలు ఇంకా పెరిగి ఆయన చిక్కుల్లో పడతారు. అయితే, సీఎంగా సునీతకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఆప్ నాయకుడు ఒకరు చెబుతున్నారు. సునీతా ఉన్నత విద్యావంతురాలు. ఆమె ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేశారు. ప్రభుత్వాన్ని నడపడం గురించి బాగా అవగాహన ఉందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ, హరియాణా, గుజరాత్‌ లో ప్రచారం చేశారు. కేజ్రీ జైల్లో ఉన్న ఆరు నెలల కాలంలో తరచూ మీడియా ముందుకువచ్చి మాట్లాడారు. జైలు నుంచి కేజ్రీ సందేశాలను చదివి వినిపించారు. ఢిల్లీ, రాంచీలో ఇండియా కూటమి ర్యాలీల్లోనూ పాల్గొన్నారు.