రూ.2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించేటోళ్ల విమర్శించేది?
అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందనగా, దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కింది.
By: Tupaki Desk | 4 Jan 2025 5:41 AM GMTఅసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందనగా, దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కింది. శుక్రవారం ప్రధాని మోదీ బీజేపీ ప్రచార భేరి మోగించారు. ఈ సందర్భంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్ ప్రధాని మోదీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం షేష్ మహల్ కోసం మాట్లాడుతున్న ప్రధాని మోదీ తన కోసం రూ.2,700 కోట్లతో బంగ్లా నిర్మించుకున్నారని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని రూ.8,700 కోట్ల విమానంలో తిరుగుతుంటారని, రూ.10 లక్షల సూట్ ధరిస్తారని ఆరోపించారు. పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి చేసిందేమీ లేదని, అయినా తమ ప్రభుత్వంపై ప్రధాని బురద జల్లుతున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.
అంతకుముందు రామ్ లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఢిల్లీకి ఆప్ ఒక ఆపదగా అభివర్ణించారు. ఢిల్లీ ప్రజలు ఆ ఆపద నుంచి బయటపడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం వరుస కుంభకోణాలు, అవినీతికి పాల్పడుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఢిల్లీలో మురికివాడల్లో నివసిస్తున్న ప్రజల కోసం నిర్మించిన కాలనీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ఈ విమర్శలు చేయగా, ఆ సభ ముగిసిన వెంటనే కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఢిల్లీ ఎదుర్కొంటున్న ఆపద బీజేపీనే అంటూ ప్రధాని విమర్శలను తిప్పికొట్టారు. బీజేపీ విపత్తుకు కారణం ఒకటి సీఎం అభ్యర్థి లేకపోవడం, రెండో ఆ పార్టీకి దశ దిశ లేకపోవడం, మూడు ఢిల్లీ ఎన్నికలకు ఎలాంటి అజెండా లేకపోవడం అంటూ మండిపడ్డారు. ఢిల్లీ వాసులకు బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. 2020 మ్యానిఫెస్టోలో 2020 నాటికి ఢిల్లీలో అందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిందని, కాని ఇప్పటివరకు కేవలం 4,500 ఇళ్లు మాత్రమే నిర్మించందన్నారు. ఢిల్లీలో నాలుగు లక్షల మురికివాడలు ఉన్నాయని, 15 లక్షల ఇళ్లు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆప్ అధినేత చెప్పారు. బీజేపీ మ్యానిఫెస్టో ఐదేళ్లకు సంబంధించినది కాదని, 200 ఏళ్లకు హామీలిస్తుందని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2013 నుంచి అక్కడ ఆప్ ప్రభుత్వం కొనసాగుతోంది. 2014 నుంచి ఢిల్లీలో అన్ని పార్లమెంట్ స్థానాలను బీజేపీయే గెలుచుకుంటోంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల జరిగే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా, తమ 12 ఏళ్ల పాలన విజయాలతో మళ్లీ గెలుస్తామని ఆప్ ధీమాగా ఉంది. రెండు పార్టీలు ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే 70 స్థానాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించింది. ప్రచారం కూడా ప్రారంభించింది. బీజేపీ ఇంకా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియనే మొదలుపెట్టలేదు. అయినా ప్రధాని మోదీ సభతో ఎన్నికల సమర శంఖం పూరించారు.