ఆల్ ఫ్రీ అరవింద్..నాటి క్రేజ్ ఏదీ ?
ఢిల్లీని 2013 నుంది దాదాపు పుష్కర కాలంగా ఆప్ ఏలుతోంది. ఇప్పటికి నాలుగు సార్లు ఢిల్లీకి సీఎం అయ్యారు అరవింద్ కేజ్రీవాల్.
By: Tupaki Desk | 4 Jan 2025 6:30 AM GMTఢిల్లీని 2013 నుంది దాదాపు పుష్కర కాలంగా ఆప్ ఏలుతోంది. ఇప్పటికి నాలుగు సార్లు ఢిల్లీకి సీఎం అయ్యారు అరవింద్ కేజ్రీవాల్. ఆయన అన్నా హజారే 2011లో అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సామాజిక ఉద్యమం నుంచి పుట్టుకుని వచ్చి అనంతరం రాజకీయ నేతగా టర్న్ అయ్యారు. చాలా మంది సామాజిక ఉద్యమ నాయకులు రాజకీయాల్లో రాణించలేరు. కానీ అరవింద్ కేజ్రీవాల్ కి మాత్రం అదృష్టం అలా కలసివచ్చింది.
దాంతో పాటు అవినీతి మచ్చ ఎరగని బ్యూరోక్రాట్ కావడం నిజాయతీ నిండుగా ఉన్న తాజా నేతగా 2013 ఢిల్లీ ఎన్నికల నాటికి జనం ముందు ఆవిష్కృతం కావడం ఆయనకు అనుకూలంగా మారాయి. ఇక అన్నా హజారే శిష్యుడిగా గుర్తింపు ఆయన చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం కూడా పూర్తి స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఉపయోగపడ్డాయి.
ఆయన మధ్యతరగతి మనసులు గెలుచుకున్నారు. అంతే కాదు విద్య వైద్య రంగంలో పాలనాపరమైన సంస్కరణలు తీసుకుని వచ్చారు. తాగు నీరు విద్యుత్ వంటి రంగాలను పేదలను చేరువ చేశారు. మహిళల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో 2015లో అలాగే 2020లో కూడా అరవింద్ కేజ్రీవాల్ హవాకు తిరుగులేకుండా పోయింది.
అయితే ఆయన మీద లిక్కర్ స్కాం ఆరోపణలు రావడం కొంతకాలం జైలులో ఉండడంతో ఇమేజ్ కొంత మేరకు దెబ్బ తిన్నది అని అంటున్నారు. తనకు బదులుగా యువ నాయకురాలు అయిన అతిషీని సీఎంగా నియమించడం ద్వారా కొత్త వ్యూహానికి తెర తీశారు. ఇంత చేసినా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ కి ఒకింత కష్టమే అని అంటున్నారు.
ఆయన సుదీర్ఘ పాలనతో జనాలు మార్పు కోరుకుంటున్నారు అని అంటున్నారు. మరో వైపు ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠం కొట్టాలని బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంది. 1993 తరువాత బీజేపీకి మళ్లీ ఢిల్లీలో అధికారం దక్కలేదు. అంటే మూడు దశాబ్దాలుగా బీజేపీ చాలా ఓపికగా హస్తినను హస్తగతం చేసుకోవడం కోసం ఎదురుచూస్తోంది. 1998లో గెలిచిన కాంగ్రెస్ 2013 దాకా పదిహేనేళ్ల పాటు అధికారం చలాయించింది.
ఆ తరువాత ఆప్ పదకొందేళ్ళ పాటు పవర్ లో ఉంది. దాంతో ఈసారి కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా బీజేపీ దూకుడు ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ఢిల్లీలో చేపడుతూ బీజేపీని జనాలకు చేరువ చేస్తున్నారు.
మరో వైపు చూస్తే ఆప్ లో కూడా మునుపటి ఐక్యత నేతల్లో లేదు అంటున్నారు. ఇక కేజ్రీవాల్ రెక్కల కష్టం, ఆయన ఇమేజ్ మీదనే ఈసారి ఎన్నికల్లో తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ అలవి కానీ హామీలను ఇస్తున్నారు అన్న చర్చ సాగుతోంది.
ఆయన కూడా రొటీన్ పొలిటికల్ అధినేతగా మారిపోయారా అన్న మాట కూడా వినిపిస్తోంది. పార్ధనా మందిరాలలో పనిచేసే వారికి గౌరవ వేతన అని ఆయన తాజాగా భారీ హామీని ప్రకటించారు. దేవాలయాలు, గురుద్వారాలలో పనిచేసే పూజారులు, గ్రంథీలకు నెలకు గౌరవవేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చాలా పెద్ద హామీనే కేజ్రీవాల్ ప్రకటించారు.
అదే విధంగా మహిళలకు నెలకు రెండు వల ఒక వంద రూపాయలు ఉచితంగా కచ్చితంగా ఇస్తామని మరో భారీ పథకాన్ని కూడా ప్రకటించారు. అలాగే సీనియర్ సిటిజన్లకు మరో స్కీమ్ ను ప్రకటించారు. ఇలా చాలా ఉచితాలను తాయిలలను బయటకు తీస్తున్న అరవిందుడు మామూలు రాజకీయ నేతగా మారిపోయారా అని అంతా అనుకుంటున్నారు.
ఆయన ఈసారి గెలిస్తే అయిదవ సారి ఢిల్లీ పీఠాన్ని ఎక్కిన వారిగా రికార్డు నెలకొల్పుతారు. అది జరగాలనే ఆయన ఇంతలా అపసోపాలు పడుతున్నారు అంటున్నారు. రానున్న రోజులలో ఆయన మరిన్ని ఉచితాలకు తెర తీసి ఆల్ ఫ్రీ అరవిందుడుగా సరికొత్త అవతారంలోకి మారుతారేమో అని కూడా అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ జాతకం ఏ విధంగా ఉందో.