ఐసీయూలో చేరిన డి. శ్రీనివాస్... ఎంపీ అరవింద్ రిక్వస్ట్ ఇదే
ఆయనకు మూత్ర సంబంధిత సమస్య ఉందని, అదికాస్తా తీవ్రమవ్వడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారని తెలుస్తుంది.
By: Tupaki Desk | 2 Jun 2024 3:40 AM GMTకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఆయన తాజాగా ఐసీయూలో చేరారు. ఆయనకు మూత్ర సంబంధిత సమస్య ఉందని, అదికాస్తా తీవ్రమవ్వడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారని తెలుస్తుంది.
అవును... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యంతో ఐసీయూలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, బీజేపీ ఎంపీ ధర్మపురీ అరవింద్ ఆన్ లైన్ వేదికగా వెళ్లడించారు. ఇందులో భాగంగా... తన తండ్రి మూత్ర సంబంధిత సమస్యల కారణంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చబడ్డారని తెలిపారు.
ఈ సందర్భంగా తన తండ్రి కోసం ప్రార్థించాలని సోషల్ మీడియా వేదికగా అరవింద్ కోరారు. గత కొంతకాలంగా డి. శ్రీనివాస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఒక సమయంలో ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకున్నా.. తాజాగా ఆయన ఐసీయూలో చేరారని.. ఎంపీ అరవింద్ వెల్లడించారు.
కాగా... 1989లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ టౌన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలిచిన డి.శ్రీనివాస్... రాష్ట్ర మంత్రివర్గంలోనూ స్థానం సంపాదించారు. ఈ క్రమంలోనే 1998లో తొలిసారిగా పీసీసీ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. అనంతరం 1999లో రెండోసారి, 2004లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి, రెండోసారి పీసీసీ చీఫ్ అయ్యారు.
ఈ క్రమంలోనే వైఎస్సార్ కేబినెట్ లోనూ మంత్రిగా పనిచేశారు. ప్రధానంగా 2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో డి.శ్రీనివాస్.. వైఎస్సార్ తో కలిసి కీలక పాత్ర పోషించారని చెబుతారు! అనంతర పరిణామాల నేపథ్యంలో... 2015 - జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆరెస్స్ లో చేరారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయన.. త్వరగా కోలుకోవాలని అభిమానులు, అనుచరులు, స్నేహితులు, సన్నిహితులు, ప్రజానికం కోరుకుంటున్నారు!