Begin typing your search above and press return to search.

వచ్చినట్లే వచ్చి ఆగిపోయిన బెయిల్.. సీఎంకు బిగ్ షాక్

గురువారం ఆయనకు బెయిల్ రావడంతో కేసులో కీలక పరిణామంగా భావించగా, ఇప్పుడు స్టే విధించడం గమనార్హం.

By:  Tupaki Desk   |   21 Jun 2024 6:35 AM GMT
వచ్చినట్లే వచ్చి ఆగిపోయిన బెయిల్.. సీఎంకు బిగ్ షాక్
X

మూడు నెలల అనంతరం.. రెగ్యులర్ బెయిల్ వచ్చిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు.. మద్యం పాలసీకి సంబంధించిన కేసులో ఉపశమనం లభించిందన్న సంతోషానికి అడ్డుకట్ట వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆ సీఎంకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గురువారం ఆయనకు బెయిల్ రావడంతో కేసులో కీలక పరిణామంగా భావించగా, ఇప్పుడు స్టే విధించడం గమనార్హం.

సాధారణ బెయిల్ పై స్టే

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌ కు అనూహ్య షాక్. గురువారం ఆయనకు రౌజ్ ఎవెన్యూ కోర్టు సాధారణ బెయిల్‌ మంజూరుచేసింది. అయితే, ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిలిపివింది. కేజ్రీ బెయిల్‌ ను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ పై కోర్టు ఆదేశాలిచ్చింది.

గురువారం కేజ్రీకి రెగ్యులర్‌ బెయిల్‌ లభించింది. రూ.లక్ష వ్యక్తిగత బాండ్ పై ఆయనను విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, దీనిపై పై కోర్టులో అప్పీలు చేస్తామని, తీర్పు అమలును 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ కోరినా.. ఆ వినతిని ట్రయల్‌ కోర్టు తిరస్కరించింది. కాగా, శుక్రవారం కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈలోగా ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.

‘బెయిల్‌ ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు. వెకేషన్‌ మా వాదనలను వినిపించేందుకు సరిపడా సమయం ఇవ్వలేదు’ అని ఈడీ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తమ పిటిషన్‌ పై అత్యవసర చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. దీన్ని స్వీకరించిన హైకోర్టు.. శుక్రవారమే విచారణ జరిపింది. అప్పటివరకు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను అమలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీ ప్రస్తుతానికి విడుదల కాలేకపోయారు.

కాగా సీఎం కేజ్రీవాల్ బయటకు వస్తున్నారనే సమాచారంతో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తిహాడ్ జైలు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలోనే హైకోర్టు తీర్పు వారికి శరాఘాతంలా తగిలింది.