Begin typing your search above and press return to search.

మోడీ వారసుడి మీద చర్చ లేపిన కేజ్రీ !

ఈ కీలక సమయంలో బెయిల్ మీద లేటెస్ట్ గా బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ ఒక రాజకీయ రచ్చను చర్చగా ముందు పెట్టారు.

By:  Tupaki Desk   |   12 May 2024 3:40 AM GMT
మోడీ వారసుడి మీద చర్చ లేపిన కేజ్రీ !
X

దేశంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యేది నరేంద్ర మోడీయే. తానే ప్రధాని అని ఆయన ఎన్నికల సభలలో చెప్పుకుంటున్నారు. బీజేపీలో చూస్తే ఈ రోజుకూ ఆయనకు పోటీ లేదు. ఫుల్ మెజారిటీ వస్తే మోడీని మించి ఎవరూ మరో మాట కూడా తీసుకుని రారు అని అంటారు.

అయితే బీజేపీలో ఇపుడు 370 సీట్లు సొంతంగా సాధించాలని అలాగే ఎన్డీయేతో కలుపుకుని నాలుగు వందల సీట్లు సాధించాలని అతి పెద్ద లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఈ కీలక సమయంలో బెయిల్ మీద లేటెస్ట్ గా బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ ఒక రాజకీయ రచ్చను చర్చగా ముందు పెట్టారు.

మోడీ వారసత్వం మీదనే ఆయన ఓపెన్ డిబేట్ ని పెట్టేశారు. మోడీకి తొందరలో డెబ్బై అయిదేళ్ళు నిండుతాయి కాబట్టి ఆయన వారసుడు ఎవరు అంటూ కేర్జీ వాల్ ఒక చర్చకు ముందుకు తెచ్చారు. బీజేపీలో ఏడున్నర పదుల వయసు దాటిన వారు క్రియాశీల రాజకీయాల్లో ఉండరాదంటూ ఒక రూల్ ని పాస్ చేసి మహామహులైన అద్వానీ మురళీ మనోహర్ జోషీ వంటి వారిని ఎందరిలో పక్కన పెట్టేసిన వర్తమాన నాయకత్వం అంటూ ఆయన కాషాయం పార్టీ సొంత విషయాలనూ కెలికి వదిలి పెట్టారు.

ఇక అదే రూల్ మోడీకి కూడా వర్తిస్తుంది కదా అంటూ మొదలెట్టారు. మోడీ వారసుడిగా కొత్త ప్రధాని అయ్యేది అమిత్ షా అంటూ ఆ జవాబు తానే చెప్పేశారు. అంతటితో ఆగని కేజ్రీ బీజేపీలో ఆ ఇద్దరు అగ్ర నాయకులు ఎందరినో బలి చేశారు అంటూ మోడీ అమిత్ షాల మీద విమర్శలు సంధించారు. ఇక కొత్తగా బీజేపీలో వేటు పడబోయేది యూపీ సీఎం యోగీ మీదనే అని బాంబు పేల్చారు.

యూపీ సీఎం ఆదిత్యనాధ్ కి పదవీ గండం ఉందని మోడీ మూడవసారి ప్రధాని కాగానే మొదట సీటు లేచిపోయేది ఆయనకే అని కూడా జోస్యం చెప్పారు. అయితే బీజేపీకి ఈసారి 230 కంటే ఎక్కువ సీట్లు రావని అందువల్ల ఈ వారసత్వాలు యోగీ సీటు గల్లంతు వంటి గొడవలు ఉండవులే అని జవాబూ ఆయనే చెప్పేశారు.

ఈసారి ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ప్రజాస్వామ్య యుతమైన ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. అయితే కేజ్రీ వాల్ కి గట్టి కౌంటర్ ని అమిత్ షా ఇచ్చేశారు. మోడీయే ఎప్పటికీ తమ ప్రధాని అంటూ ఆయనకు వారసులు ఎవరూ లేరని తేల్చేశారు. ఆయనకు 75 ఏళ్ళ వయోపరిమితి కూడా వర్తించదూ అన్నట్లుగానూ మాట్లాడారు.

ఇక అరవింద్ కేజ్రీ వాల్ జస్ట్ బెయిల్ మీద బయటకు వచ్చారని అది ఆయనకు న్యాయ స్థానాలు ఇచ్చిన క్లీన్ చిట్ కాదని విమర్శించారు. ఎన్నికలు ముగిసిన పిమ్మట ఆయన మళ్లీ దర్యాప్తు సంస్థల ముందు హాజరు కావాల్సి ఉంటుందని కూడా గట్టిగా చెప్పారు. మొత్తానికి జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ బీజేపీ మీద మోడీ అమిత్ షాల మీద తన బాణాలను సూటిగా పదునుగా సంధిస్తున్నారు. ఆయన మరిన్ని రోజులు ఇదే తీరున బీజేపీని ఎండగట్టే పనిలో బిజీగా ఉంటారు అని అంటున్నారు. ఉత్తర భారతాన చప్ప చప్పగా ఉన్న ఎన్నికల ప్రచారం కేజ్రీ ఎంట్రీతో ఆయన మాటల దాడులతో ఇపుడు ఒక్కసారిగా వేడెక్కుతోంది.