Begin typing your search above and press return to search.

దమ్ముంటే హైదరాబాద్ తప్ప ఇంకెక్కడైనా పోటీ చేయమంటే?

By:  Tupaki Desk   |   26 Aug 2023 11:30 PM GMT
దమ్ముంటే హైదరాబాద్ తప్ప ఇంకెక్కడైనా పోటీ చేయమంటే?
X

సవాలు చేసే వారు ఎవరైనా.. తమకు ఎదురయ్యే సవాళ్లను స్వీకరించే సత్తా ఉండాలి. ఇన్ కమింగే తప్పించి.. అవుట్ గోయింగ్ కు ఇష్టపడనట్లుగా.. సవాళ్లు విసరటమే కానీ స్వీకరించే సత్తా లేనోళ్లు.. మాటల విషయంలో మరింత పొదుపుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటివేమీ పట్టనట్లుగా వ్యవహరించటం అగ్రనేతలకు సైతం అలవాటుగా మారింది. తన బలాన్ని గొప్పగా చాటుకోవటం తప్పేం కాదు. కానీ.. ఆ పేరుతో అహంకారాన్ని ప్రదర్శించటం తప్పే అవుతుంది. అందునా.. రాజకీయాల్ని మతంతో ముడిపెట్టి.. భావోద్వేగాల్ని రగిల్చే మజ్లిస్ అధినేత లాంటి వారు సవాళ్లు విసిరితే అస్సలు సూట్ కాదు అని అంటున్నారు

కానీ.. ఇటీవల కాలంలో ఆయన ఒక సవాల్ ను తరచూ విసురుతున్నారు. తనకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి పోటీ చేసే దమ్ముందా? అని. ఆయన ఆ సవాలు విసరటానికి కారణం ఏమిటో అందరికి తెలిసిందే. ఒక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉండటంతో పాటు.. భావోద్వేగాల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం ద్వారా తన అధిక్యతను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్న పరిస్థితి అని అంటున్నారు .

వరుస పెట్టి ఎంపీగా గెలిచిన తన నియోజకవర్గంలో ఇప్పటివరకు అసద్ చేసిన అభివృద్ధి పనులంటూ ఏమీ లేవు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరికి గుర్తుండిపోయే పని ఒక్కటంటే ఒక్కటి లేదు అని అంటున్నారు బీజేపీ సపోర్టర్స్ .

మత రాజకీయాల్ని ఓపెన్ గా మాట్లాడుతూ చేస్తూ.. మైనార్టీల అమాయకత్వాన్ని ఓట్లుగా దండుకునే ఆయన.. ఎన్నికల్లో పోటీకి సవాలు విసిరే ముందు.. తనను నమ్ముకున్న తన ప్రజల బతుకుల్ని తాను ఎంత మార్చానన్న విషయం మీద మాట్లాడితే బాగుంటుంది అని అంటున్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణాసి నియోజకవర్గం ఎంతమేర మార్పులు చోటు చేసుకున్నది అందరికి తెలిసిందే. మరి.. అసద్ అలాంటి పోటీ పెట్టుకునే దమ్ముందా?

మెట్రో రైలును వద్దంటే వద్దని బెదిరింపులకు దిగి.. ఈ రోజున మళ్లీ మెట్రో కావాలంటూ రోడ్ల మీదకు వచ్చిన అసద్.. తన తీరు కారణంగా ఇప్పటికి హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాన్ని దశాబ్దాల వెనుకబాటుతనంలోనే ఉంచేశారన్న విషయాన్ని మర్చిపోకూడదు. దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాలు విసిరే అసద్.. దమ్ముంటే.. హైదరాబాద్ లో కాకుండా దేశం మొత్తంలో ఎక్కడైనా గెలిచే సత్తా ఉందా? అని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి.

ఎన్నికల పోటీ గురించి సవాళ్లు విసిరే అసదుద్దీన్.. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోని అక్షరాస్యత.. వారి తలసరి ఆదాయం.. జీవన నాణ్యత.. అక్కడి ఉపాధి అవకాశాలు.. మౌలిక వసతుల కల్పన.. ఆరోగ్య వసతులు.. ఇలాంటి వాటి గురించి మాట్లాడే దమ్ముందా? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని ఒక మోడల్ మాదిరి చాటి చెప్పేంత సీన్ ఉందా? రాజకీయాన్ని మతంలో రంగరించి.. నిత్యం ద్వేష భావాన్ని నింపే అసద్.. ఫలానా చోట పోటీ చేయాలని సవాలు చేసే నైతికత ఆయనకు ఉందా? అని అడుగుతున్నారు

ఆయన నిత్యం జపించే పాతబస్తీ ప్రజలకు సదూరాన.. అక్కడెక్కడో రాజేంద్రనగర్ లో విలాసవంతమైన భవనంలో బతికేసే ఆయన మాటలకు.. చేతలకు మధ్య పొంతన ఉండదన్న విషయం అందరికి తెలిసిందే అని అంటున్నారు .