Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్‌ పై అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు!

రేవంత్‌ పై మొదట్లో పెదవి విరిచినవారే ఆయన నిజమైన రాజకీయవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా పరిణతి చూపుతున్నారని అభినందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 March 2024 5:21 AM GMT
సీఎం రేవంత్‌ పై అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించింది మొదలు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజారంజకంగా పరిపాలిస్తోందనే ప్రశంసలు ఇంటాబయటా లభిస్తున్నాయి. రేవంత్‌ పై మొదట్లో పెదవి విరిచినవారే ఆయన నిజమైన రాజకీయవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా పరిణతి చూపుతున్నారని అభినందిస్తున్నారు.

ఇప్పుడు ఈ కోవలో ఏకంగా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆప్త మిత్రుడు, ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అయిన అసదుద్దీన్‌ ఓవైసీ కూడా చేరిపోయారు. తాజాగా హైదరాబాద్‌ పాతబస్తీలో మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనుల్లో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు అసదుద్దీన్‌ ఓవైసీ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ముఖ్యమంత్రి రేవంత్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డికి స్వాగతం చెబుతున్నానన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారని.. దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. రేవంత్‌ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే అభివృద్ధికి తాము పూర్తిగా సహకరిస్తామని అసదుద్దీన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌ సర్కారు త్వరలో కూలిపోతుందని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఇటీవల కాలంలో పదే పదే వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందని, రేవంత్‌ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని అసదుద్దీన్‌ ఓవైసీ స్వయంగా వ్యాఖ్యానించడం ఆసక్తికర పరిణామాలకు దారితీసింది.

అంతేకాకుండా రేవంత్‌ మొండి ఘటమని.. పోరాడి అధికారం సాధించుకున్నారని అసదుద్దీన్‌ ఓవైసీ ప్రశంసల వర్షం కురిపించారు.

తెలంగాణ అభివృద్ధిలో ఎంఐఎం భాగస్వామి అవుతుందని అసదుద్దీన్‌ తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొందరు ప్రయత్నిస్తున్నారని, దీన్నీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక యాకుత్‌ పురాలో మూడు రోడ్ల విస్తరణ పనులు పెండింగ్‌ లో ఉన్నాయని చెప్పగానే రూ.200 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని కొనియాడారు. అలాగే మీరాలం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని అభినందించారు.

మూసీ నది అభివృద్ధిలోనూ తమవంతు సహకారం అందిస్తామని అసదుద్దీన్‌ ఓవైసీ స్పష్టం చేశారు. నాగోల్‌ నుంచి విమానాశ్రయం వరకు మెట్రో పనులు త్వరితగతిన పూర్తయితే ఎంతోమందికి ఉపయోగపడుతుందని అసదుద్దీన్‌ సూచించారు.

సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టగా.. ఇప్పటి వరకు ఆయన పరిపాలనను రాజకీయ విశ్లేషకులు కొనియాడారు. ఇప్పుడు కేసీఆర్‌కు అత్యంత ప్రియమైన రాజకీయ మిత్రుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ముఖ్యమంత్రిని పొగిడేవారి జాబితాలో చేరారు.

వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఐఎం కాంగ్రెస్‌ పార్టీతో సన్నిహిత సంబంధాలు నెరిపింది. వైఎస్సార్‌ కూడా అసదుద్దీన్‌ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. వైఎస్సార్‌ మరణం తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎంఐఎం కాంగ్రెస్‌ కు దూరంగా జరగడం ప్రారంభించింది. ఇక తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్‌ కు అసదుద్దీన్‌ ఓవైసీ అత్యంత ఆప్తుడిగా మారారు. తెలంగాణలో ముస్లిం ఓటుబ్యాంకుపై కన్నేసిన కేసీఆర్‌.. అసదుద్దీన్‌ తో అత్యంత స్నేహ సంబంధాలను నెలకొల్పుకున్నారు. ఎంఐఎం అడిగిందే తడవుగా ఏ పనికావాలన్నా చేసిపెట్టారు.

కేసీఆర్‌ కోరిక మేరకు, ఆయన ప్రయోజనాలు కల్పించడానికే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పాతబస్తీకే పరిమితమైంది. తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి అసదుద్దీన్‌ ఓవైసీ.. రేవంత్‌ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తుండటం హాట్‌ టాపిక్‌ గా మారింది.