Begin typing your search above and press return to search.

పొలిటికల్ కౌంటర్స్ లో కండోమ్స్ ఎంట్రీ.. మోడీని తగులుకున్న అసదుద్ధీన్!

ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని, డివైడ్ అండ్ రూల్ పాలిసీలో ముందుకు కదులుతున్నారనే విమర్శలు వినిపిస్తున్న వేళ తాజాగా అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   29 April 2024 6:21 AM GMT
పొలిటికల్  కౌంటర్స్  లో కండోమ్స్  ఎంట్రీ.. మోడీని తగులుకున్న అసదుద్ధీన్!
X

లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ - ఎంఐఎం పార్టీల మధ్య మాటల తూటాలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. మోడీ తన ఎన్నికల ప్రచారాల్లో ప్రధానంగా... ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని, డివైడ్ అండ్ రూల్ పాలిసీలో ముందుకు కదులుతున్నారనే విమర్శలు వినిపిస్తున్న వేళ తాజాగా అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి ముస్లిం జనాభాపై స్పందించారు.

అవును... ఇటీవల రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా... ప్రధాని నరేంద్ర మోడీ చేసినట్లు చెబుతున్న "ఎక్కువ పిల్లలు ఉన్నవారు" అనే వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఇందులో భాగంగా... ముస్లిం సమాజంలోని పురుషులే ఎక్కువగా కండోమ్ లను వినియోగిస్తున్నారని, చైల్డ్ స్పేసింగ్ లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారని మోడీ చెబుతున్నారు కానీ... అని మొదలుపెట్టిన అసదుద్ధీన్... నరేంద్ర మోడీకి ఆరుగురు, అమిత్ షాకు ఆరుగురు, ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్‌ కి 10-12 మంది సోదర సోదరీమణులు ఉన్నారని అసదుద్దీన్ ఒవైసీ చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో... కేంద్ర గణాంకాల ప్రకారం చూసుకున్నా.. ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోందని అన్నారు!

వాస్తవాలు ఇలా ఉంటే... నరేంద్ర మోడీ మాత్రం హిందూ సోదరుల్లో భయాన్ని సృష్టించేందుకు, ద్వేషాన్ని పెంచుతున్నారని అసదుద్దీన్ ఆరోపించారు. అదేవిధంగా... ఈ దేశంలో ముస్లింలు ఎప్పటికీ మెజార్టీగా ఉండరని, ఆ పరిస్థితుల్లో ముస్లింల పట్ల ఈ భయాన్ని మీరు ఎంత కాలం కొనసాగిస్తారంటూ మోడీని ప్రశ్నించారు. ప్రధాని మోడీ 17 కోట్ల భారతీయ ముస్లింలను చొరబాటుదారులని పిలిచారని ఆరోపించారు.

కాగా... కాంగ్రెస్ మేనిఫెస్టోలోని "సంపద పునర్విభజన" అనే హామీని ప్రస్తావించిన ప్రధాని మోడీ.. దానిపై సరికొత్త ఇంటర్ ప్రిటేషన్ చేస్తూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే! దేశంలోని ప్రజల సంపదను చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారంటూ ఆయన వ్యాఖ్యానించారనే కథనాలు వచ్చాయి! దీంతో కాంగ్రెస్ సహా విపక్షాలు మోడీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.