పావుగంట పాటు ఆపకుండా.. ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎక్కడ..? ఎందుకు?
తన ఇంటిపై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించిన అసదుద్దీన్.. ఓవైపు ముస్లింల ఇళ్లపైకి బుల్డోజర్లు నడుపుతూ
By: Tupaki Desk | 14 Aug 2023 2:48 PM GMTహైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఆగంతకులు ఆపకుండా పావుగంట పాటు రాళ్ల వర్షం కురిపించినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌ను బట్టి తెలుస్తోంది. ఈ రాళ్ల దాడిలో ఎంపీ ఇంటి కిటికీ అద్దాలు.. కొంత మేరకు ఫర్నిచర్ కూడా ధ్వంసమైనట్టు సెక్యూరిటీ తెలిపారు. ఢిల్లీలోని ఎంపీ ఇంటిపై జరిగిన ఈ ఘటనపై అసదుద్దీన్ పీఏ.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి.. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. అసద్ ఇంటితోపాటు.. చుట్టుపక్కలున్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తన ఇంటిపై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించిన అసదుద్దీన్.. ఓవైపు ముస్లింల ఇళ్లపైకి బుల్డోజర్లు నడుపుతూ.. మరోవైపు ఎంపీల ఇంటిపైకి రాళ్లు రువ్వడం ఏ మాత్రం సమంజసమని కేంద్రాన్ని నిలదీశారు.
కొన్నాళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. ఇవాళ జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. రాళ్ల దాడి గురించి తనకు ఎలాంటి భయం లేదన్నారు. ఎంపీ ఇంటిపైనే రాళ్లదాడి జరిగితే ఇక సామాన్యుడి సంగతేంటని ఆయన ప్రశ్నించారు.తన ఇంటిపై జరిగిన రాళ్ల దాడే.. బీజేపీ నేత ఇంట్లో జరిగివుంటే పెద్ద గొడవే జరిగేదని.. ఇలాంటి ఘటనలు దేశానికి ఏ మాత్రం మంచిదికాదని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.
గతంలోనూ ఇలాంటి దాడులు ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడులు గతంలోనూ జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా కొందరు దుండగులు దాడికి దిగారు. అంతకుముందు 2014 లో కూడా రాళ్ల దాడి జరిగింది. ఇప్పటి వరకూ నాలుగుసార్లు ఎంపీ ఇంటిపై దాడులు జరగ్గా.. ఇప్పటివరకు ఒక్క ఘటనలోనూ బాధ్యులను గుర్తించకపోవడం గమనార్హం.