Begin typing your search above and press return to search.

మళ్లీ తెరపైకి థర్డ్‌ ఫ్రంట్‌!

'ఆలూ లేదు.. చూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం' అన్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీరు ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి

By:  Tupaki Desk   |   20 Sep 2023 7:22 AM GMT
మళ్లీ తెరపైకి థర్డ్‌ ఫ్రంట్‌!
X

'ఆలూ లేదు.. చూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం' అన్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీరు ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క 28 ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి ఇండియా కూటమిగా జట్టు కట్టాయి. మరోవైపు ఇంచూమించూ ఇన్నే పార్టీలతో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే పక్షాలు కూటమిలో ఉన్నాయి. ఈ రెండు కూటముల్లో చేరని పార్టీలు తెలంగాణలో రెండే.. అవి.. బీఆర్‌ఎస్, ఎంఐఎం. ఈ రెండూ ప్రస్తుతం ఒకటితో మరొకటి అంటకాగుతున్నాయి.

తెలంగాణలో పెద్ద ఎత్తున ఉన్న ముస్లిం ఓట్లను కొల్లగొట్టడానికి కేసీఆర్‌ మొదటి నుంచి మజ్లిస్‌ పార్టీని దువ్వుతూ వస్తున్నారు. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అడిగిందే తడవుగా అన్ని కోరికలను నెరవేరుస్తున్నారు.

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు స్నేహపూర్వక ఒప్పందంతో కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో థర్డ్‌ ఫ్రంట్‌ ఆవశ్యకత ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో శూన్యత ఉందని.. దాన్ని కేసీఆర్‌ నేతృత్వంలో థర్డ్‌ ఫ్రంట్‌తో భర్తీ చేస్తామని ఓవైసీ చెబుతుండటం గమనార్హం,

ఎన్‌డీఏ, ఇండియా కూటముల్లోని రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేవని కూడా అసదుద్దీన్‌ అంటున్నారు. మాయావతి, కేసీఆర్‌ వంటి సెక్యులర్‌ నేతలు ఆయా ఫ్రంట్లలో లేరని ఓవైసీ గుర్తు చేశారు. అలాగే ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రకు చెందిన అనేక పార్టీలకు ఈ ఫ్రంట్లల్లో సభ్యత్వం లేదని వెల్లడించారు. వారందర్నీ కలుపుకుని వెళ్తామని ప్రకటించారు. రాజకీయాల్లో థర్డ్‌ ఫ్రంట్‌కు ప్రాధాన్యం ఏర్పడిందని.. దీనికి కేసీఆర్‌ నాయకత్వం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని కూడా అసదుద్దీన్‌ ఆయన తరఫున వకల్తా పుచ్చుకోవడం గమనార్హం.

కాగా ఇప్పటికే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో హడావుడి చేశారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించి వచ్చారు. పంజాబ్, జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వెళ్లి వచ్చారు. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు.. భగవంత్‌ సింగ్‌ మాన్, హేమంత్‌ సోరెన్, అరవింద్‌ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కుమారస్వామి (జేడీఎస్‌) తదితరులను కలిసి వచ్చారు. అయినా కేసీఆర్‌ ను ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ లేకుండా బీజేపీని ఓడించడం సాధ్యం కాదని కేసీఆర్‌ ప్రతిపాదనను తోసిపుచ్చారు. కేసీఆర్‌ కు చెప్పాపెట్టకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిలో చేరిపోయాయి.

దీంతో కేసీఆర్‌ బీఆర్‌ఎస్, అసదుద్దీన్‌ ఓవైసీ మజ్లిస్‌ పార్టీలు ఎటూ కొరగాకుండా మిగిలిపోయాయి. ఈ రెండు పార్టీలను అటు ఎన్‌డీయే కూటమి, ఇటు కాంగ్రెస్‌ కూటమి నమ్మడం లేదు. దీంతో థర్డ్‌ ఫ్రంట్‌ పేరుతో మళ్లీ తన జాంజిగ్రీ దోస్తు అసదుద్దీన్‌ తో కేసీఆర్‌ డ్రామా నడిపిస్తున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి.