బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేస్తారా? మద్దతిస్తారా? మాజీ దోస్త్ సూటి ప్రశ్న
రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఈ మేరకు సంకేతాలిచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను ఉద్దేశించి కీలక ప్రశ్నలు సంధించారు.
By: Tupaki Desk | 16 July 2024 5:30 PM GMTఎమ్మెల్యేలేమో కాంగ్రెస్ లోకి.. రాజ్యసభలో ఉన్న ఎంపీలేమో బీజేపీలోకి.. ఇదీ తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి. అయితే, ఎంపీలు వెళ్తారా? లేదా? అనేది ఊహాగానమే. దీనిపై స్పష్టత రాలేదు. మరోవైపు రోజుకో ఎమ్మెల్యే మాత్రం పార్టీని వీడుతున్నారు. మరొక్క వారం పదిరోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే అంటున్నారు. ఇలాంటి సమయంలో మాజీ దోస్త్ నుంచి గులాబీ పార్టీకి కీలక ప్రశ్న ఎదురైంది.
మా బద్ధ శత్రువుతో కలుస్తారా.?
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీతో స్నేహంగా మెలిగింది మజ్లిస్. పాత బస్తీ సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పలు హామీలు పొందింది. అయితే, తెలంగాణలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పట్ల మజ్లిస్ వైఖరి మారిందనే చెప్పాలి. కాగా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది మజ్లిస్. పాత బస్తీలో పట్టు కోసం ఇలా చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో స్తబ్ధుగా ఉన్నట్లు కనిపించినా.. పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వానికే మద్దతు అనుకోవాలి. రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఈ మేరకు సంకేతాలిచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను ఉద్దేశించి కీలక ప్రశ్నలు సంధించారు. తమ బద్ద శత్రువు బీజేపీ వైపు బీఆర్ఎస్ మొగ్గుచూపుతుందన్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
విలీనం చేస్తారా?
బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారా? లేక ఆ కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వానికి బయటినుంచి మద్దతు ఇస్తారా? అంటూ హైదరాబాద్ ఎంపీ అయిన అసదుద్దీన్ ప్రశ్నించారు. బీజేపీలో విలీనం చేస్తారంటూ వస్తున్న ఊహాగానాలపై స్పందించాలంటూ నిలదీశారు. ఒకప్పటి మిత్రపక్షం అయిన మజ్లిస్ నుంచి బీఆర్ఎస్ ఇలాంటి పెద్ద ప్రశ్న రావడం సంచలనమే. మరోవైపు అసదుద్దీన్ కాంగ్రెస్ వైపు మళ్లేందుకే ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని.. లేదా కాంగ్రెస్ పార్టీ వర్గాలే ఆయనతో ఇలా మాట్లాడిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి అసద్ భాయ్ ప్రశ్నకు కేసీఆర్, కేటీఆర్ ఏం సమాధానం ఇస్తారో చూడాలి.