ఓబీసీలకు ఓవైసీ గేలం.. నష్టం ఎవరికి...?
తిరుపతిలో జరిగిన ఓబీసీ జాతీయ సమావేశానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వచ్చారు
By: Tupaki Desk | 8 Aug 2023 4:30 PM GMTరాష్ట్రంలో ఎన్నికలకు 8-9 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే.. ఇతర సామాజిక వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ వంటి కీలక పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ, ఓబీసీలను మాత్రం ఈ పార్టీలు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
అసలు వీరి విషయాన్ని ఈ పార్టీలు పూర్తిగా విస్మరించాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక, ఈ గ్యాప్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ముఖ్యంగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే.. రాష్ట్రంలోని ఓబీసీలకు తెలంగాణకు చెంది న ఎంఐఎం పార్టీ గేలం వేస్తున్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తిరుపతిలో జరిగిన ఓబీసీ జాతీయ సమావేశానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వచ్చారు. అంతేకాదు.. ఆయన సంచలన ప్రకటన కూడా చేశారు. ఓబీసీల అభ్యున్నతి, వారి హక్కుల కోసం.. తాము పార్లమెంటులోనూ.. బయట కూడా పోరాటం చేస్తామని ప్రకటించారు.
ఇది తేలిక విషయమేమీ కాదు. సాధారణంగా మైనారిటీ వర్గాలకే పరిమితం అయిందని అనుకున్న ఎంఐఎం.. ఇప్పుడు ఓబీసీలపై దృష్టి పెట్టడాన్ని రాజకీయ కోణంలో చూస్తే.. వైసీపీ, టీడీపీలకు నష్టమేనని చెబుతున్నారుపరిశీలకులు.
రాష్ట్రంలో ఓబీసీలు 20 శాతం ఓటు బ్యాంకు కలిగిఉన్నారు. ఇప్పటి వరకు వీరు తటస్థ ఓటర్లుగానే ఉన్నారు. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీరు కూడా రాజకీయంగా ప్రాధాన్యం కోసం ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఓవైసీ వంటి నాయకుడు వారికి అండగా నిలిచేందుకు ముందుకు రావడం.. వారిలో భరోసా నింపడం వంటి పరిణామాలు ఆసక్తిగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం.. ఏపీలోనూ పోటీ చేస్తుందనే అంచనాలు వస్తున్న దరిమిలా.. ఓవైసీ.. ఓబీసీలను ఆయుధంగా చేసుకుంటే.. ప్రధాన పార్టీలకు నష్టం కలగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు మరి ఏం చేస్తారో చూడాలి.