అసద్ ట్వీట్.. అందరికి పని చెప్పేసిందిగా?
వివాదాస్పద వ్యాఖ్యలకు.. ఘాటు విమర్శలకు.. సంచలన ట్వీట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజాగా మరో కీలక ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 27 Jan 2024 3:59 AM GMTవివాదాస్పద వ్యాఖ్యలకు.. ఘాటు విమర్శలకు.. సంచలన ట్వీట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజాగా మరో కీలక ట్వీట్ చేశారు. అయితే.. ఈసారి ఆయన రోటీన్ కు భిన్నంగా రియాక్టు అయ్యారు. తాను లక్ష్యంగా చేసుకున్న వారిపై సూటిగా స్పందించే ఆయన.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా నర్మగర్భంగా ట్వీట్ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ఏమంటే.. ‘‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. విద్వేషం బుల్డోజ్ చేయాలి. అన్యాయం ఎన్ కౌంటర్ కావాలి. అణచివేత సమూలంగా నిర్మూలించబడాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.
ఆయన ట్వీట్ కు బదులుగా పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. ఒకవిధంగా అసద్ తన ట్వీట్ తో చాలామంది చేతలుకు పని చెప్పారని చెప్పాలి. ఆయన ట్వీట్ కు రిప్లై ఇస్తున్న వారు ఆయనకు వేస్తున్న కౌంటర్లు ఆసక్తికరంగా మారాయి. ఇందులో ఆసక్తికరమైన కొన్ని ట్వీట్ల ను ప్రస్తావించాల్సిందే. అందులో ముఖ్యంగా ‘‘జ్ఞానవాపిలోకి వస్తున్న బుల్డోజర్‌కి స్వాగతం’’ అంటూ పేర్కొనగా.. మరో ట్వీట్ లో విద్వేషం ఒకవైపు నుంచే ఉండదని గుర్తించాలని పేర్కొన్నారు.
అణిచివేత సమూలంగా నిర్మూలించాలని విశ్వసిస్తున్నా అన్న మాటకు కౌంటర్ గా.. ‘హైదరాబాద్ పాతబస్తీ నుంచే మొదలు కావాలి’ అంటూ మరో నెటిజన్ రియాక్టు అయ్యారు. జ్ఞానవాపి కేసుపై హిందువుల తరఫు వాదనలు వినిపిస్తున్న లాయర్ (విష్ణు శంకర్ జైన్) వెల్లడించిన ఏఎస్ఐ నివేదికను అసద్ తిట్టి పోస్తున్నారు. ఆ నివేదిక మొత్తం ఊహాగానాలుగా కొట్టి పారేస్తున్న ఆయన.. ‘‘ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హిందూత్వ బానిసగా మారింది’ అంటూ సంచలన వ్యాఖ్య చేశారు. ఒకవేళ.. ఏదైనా అంశానికి సంబంధించి ముస్లింలకు అనుకూలంగా నివేదిక ఇస్తే.. ఆ వెంటనే.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ముస్లిం బానిసగా మారిందన్న వ్యాఖ్య చేయటాన్ని అంగీకరిస్తారా? అన్నది ప్రశ్న.
ఒకవేళ నివేదిక మీద అభ్యంతరాలు ఉంటే.. వాటిని ప్రశ్నించాలే తప్పించి.. ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడకూడదన్న విషయాన్ని అసద్ మర్చిపోయి ఉండొచ్చు.కానీ.. ఆయనకు ఆ విషయాలు గుర్తుకు వచ్చేలా వ్యవస్థలు స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వ రంగ సంస్థపై ఎలా పడితే అలా నిందలు వేయటం.. అందులో నిజానిజాలేమీ ప్రస్తావించకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ద్వారా కొత్త రచ్చకు తెర తీస్తున్న అసద్ పైన చర్యలు తీసుకోవాల్సిందేనన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.