Begin typing your search above and press return to search.

పెద్దారెడ్డి కోటలో జేసీ అస్మిత్ రెడ్డి దూకుడు

ఇలా జేసీ అస్మిత్ రెడ్డి జనాల్లోకి రావడంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో ఈ యువ నేతను గెలిపించుకుంటామని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 July 2023 3:59 AM GMT
పెద్దారెడ్డి కోటలో జేసీ అస్మిత్ రెడ్డి దూకుడు
X

ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాడిపత్రి సీటుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సీటు జేసీ ఫ్యామిలీకి పెట్టింది పేరుగా వస్తోంది. పెద్దాయన జేసీ దివాకర్ రెడ్డి 1985లో మొదలెట్టి ఇప్పటికి ఆరు సార్లు వరసబెట్టి గెలిచారు. అంటే ముప్పయ్యేళ్ళ పాటు ఆయన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఉన్నారన్న మాట.

ఇక కాంగ్రెస్ ఏపీలో పతనంతో జేసీ ఫ్యామిలీ టీడీపీకి షిఫ్ట్ అయింది. అలా 2014 లో జేసీ దివాకరరెడ్డి సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి తాడిపత్రి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేసి ఓడారు. అయినా ఆయనకు 85 వేల పై చిలుకు పోట్లు వచ్చాయి. జస్ట్ ఏడు వేల ఓట్ల తేడాతో వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచారు.

అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తాడిపత్రి మునిసిపాలిటీ నుంచి జేసీ ప్రభాకరరెడ్డి చైర్మన్ గా గెలిచి సంచలనం సృష్టించారు. ఆ విధంగా మళ్లీ తాడిపత్రి మీద జేసీ ఫ్యామిలీ పట్టు బిగించింది. ఆ మధ్యన లోకేష్ పాదయాత్ర తాడిపత్రిలో చేసినపుడు జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వచ్చే ఎన్నికల్లో మరోమారు జేసీ అస్మిత్ రెడ్డి పోటీకి దిగుతున్నారు.

ఆయన తన తండ్రి, పెదతండ్రి బాటలోనే నడుస్తూ వస్తున్నారు. ఆయన మీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో తాడిపత్రిలో కలియతిరుగుతున్నారు. మొత్తం అంతా చుట్టబెడుతున్నారు. ఏమమ్మా బాగున్నావా, ఏం తాతా ఎలా ఉన్నావ్ అని అందరినీ పలకరిస్తూ తాడిపత్రి వీధులలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రతీ చిన్న సమస్యను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు.

వైసీపీ పాలన ఎలా ఉంది అని మాటలలోనే వాకబు చేస్తున్నారు. సాగునీరు అందుతోందా, తాగు నీరు ఎలా తెచ్చుకుంటున్నారు అన్న ప్రశ్నలు వేస్తున్నారు. మీకు జరుగుబడి ఉందా. పంటలు ఎలా ఉన్నాయని రైతులతో ముచ్చట్లు పెడుతున్నారు. నిరుద్యోగ యువతను కలసి ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయని కూడా అడిగి తెలుసుకుంటున్నారు.

మీకు అంతా తెలుసు. నేను ప్రత్యేకించి వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయను అంటూ తనదైన శైలిలో జనాలకు దగ్గర అవుతున్నారు. ఇలా జేసీ అస్మిత్ రెడ్డి జనాల్లోకి రావడంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో ఈ యువ నేతను గెలిపించుకుంటామని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే పెద్దారెడ్డి మీద వ్యతిరేకత పెరుగుతోంది. ఆయన మాటలతో దూకుడు చేస్తున్నారు తప్ప జనాల్లోకి రావడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి గెలిచి జేసీ ఫ్యామిలీని రాజకీయంగా దూరం చేస్తానని పెద్దారెడ్డి చేస్తున్న సవాళ్లకు జనాలలో అంతగా ప్రతిస్పందన లేదని అంటున్నారు.

తాడిపత్రి జేసీల అడ్డా. పైగా ఇపుడు టీడీపీకి ఆదరణ పెరుగుతోంది. లోకేష్ పాదయాత్ర తరువాత పరిస్థితి మారింది. దాంతో ఇపుడు దాన్ని క్యాష్ చేసుకునే పనిలో అస్మిత్ రెడ్డి ఉన్నారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగుతున్న అస్మిత్ రెడ్డి ఈసారి తనదే విజయం అన్న ధీమాతో ఉన్నారు. మరి ఆయన దూకుడుకు బ్రేకులు వేసే పనిలో పెద్దారెడ్డి ఉన్నారా లేదా అన్నదే చర్చగా ఉంది.