Begin typing your search above and press return to search.

రోజాకు షాక్ తప్పదా? టికెట్ కూడా రాదా? నిజమెంత!

చాలామంది ముఖ్యమంత్రులు తమ సన్నిహితుల విషయంలో ఒక అడుగు వెనక్కి వేయటం కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   14 Dec 2023 3:30 PM GMT
రోజాకు షాక్ తప్పదా? టికెట్ కూడా రాదా? నిజమెంత!
X

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. అనవసరమైన బలహీనతల్ని దగ్గరకు రానివ్వట్లేదు. ఎంతటి సన్నిహితులైనా.. మరెంత విశ్వాసంగా ఉన్నా.. లెక్క దగ్గర లెక్కే అన్న తీరును ప్రదర్శిస్తున్నారు. గెలుపు లేని వారిని బరిలోకి దించేందుకు ససేమిరా అన్నట్లుగా ఆయన తీరు ఉంది. చాలామంది ముఖ్యమంత్రులు తమ సన్నిహితుల విషయంలో ఒక అడుగు వెనక్కి వేయటం కనిపిస్తుంది. వారి కోసం రాజీ పడటం.. రిస్కు తీసుకోవటం మామూలే. అయితే.. జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి.

అందుకు నిదర్శనంగా ఇటీవల 11 నియోజకవర్గాల ఇంఛార్జిలను మారుస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని చెప్పాలి. అయితే.. ఇదంతా శాంపిల్ మాత్రమేనని.. ఒక అంచనా ప్రకారం 30-40 మంది ఎమ్మెల్యేలను మార్చాల్సి ఉంటుందన్న సోషల్ మీడియా లో వాదన బలంగా వినిపిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ తప్పును ప్రస్తావిస్తున్నారు. సిట్టింగులకు సీట్లు కేటాయించి.. వారిపై ఉన్న ప్రజావ్యతిరేకతతో తాను అధికారానికి దూరం కావాల్సి వచ్చిందన్న మాట బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ కు ఎదురైన చేదు అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మంత్రి రోజాకు కూడా సీటు దక్కే అవకాశం లేదంటు సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం జరుగుతుంది . టికెట్లు రాని హిట్ లిస్టులోఆమె కూడా ఉన్నారన్న మాట హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీలో నెలకొన్న అధిపత్య పోరు కూడా రోజాకు దెబ్బ పడేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి మాటకు సీఎం జగన్ ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేసమయంలో మంత్రి రోజాకు ఆయనకు మధ్య పొసగకపోవటం.. దీనికి సంబంధించి ఇప్పటికే పలు పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

రోజా తీరుకు తగ్గట్లే పెద్దిరెడ్డి వర్గానికి చెందిన రెడ్డి వారి చక్రపాణి రెడ్డి.. కేజే శాంతి.. కేజే కుమార్ తో పాటు మరికొందరు రోజాను ఎప్పటికప్పుడు టార్గెట్ చేయటం తెలిసిందే. దీంతో.. స్వపక్షంలోనే తీవ్రమైన ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు ఆర్కే రోజా. రాజకీయ ప్రత్యర్థులపై ఫైర్ బ్రాండ్ గా వ్యవహరించే ఆమె.. సొంత పార్టీ విషయంలో మాత్రం తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. దీంతో.. ఆమెకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి బరి నుంచి కాకుండా నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సి వస్తుందంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానమైన నగరి నుంచి ఆమెకు టికెట్ లభించే అవకావశం లేదంటున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో కొందరు కీలక నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో రోజాకు అక్కడ అవకాశం లభిస్తుందన్న మాట వినిపిస్తోంది. జిల్లా మారటం అంటే.. పెద్దిరెడ్డి అధిక్యతకు తలవంచినట్లు అవుతుందని.. అందుకు రోజా ససేమిరా అంటారని అంటున్నారు. మొత్తంగా టికెట్ విషయంలో రోజా తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.