జోగిపేటలో ఒళ్లుజలదరించే క్రైం.. బాలుడ్ని చంపేసి.. చచ్చిపోయాడు
ఇలాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వారంతా ముప్ఫై ఏళ్ల లోపు వారే ఉండటం గమనార్హం.
By: Tupaki Desk | 22 April 2024 5:32 AM GMTకలలో కూడా ఊహించని కొన్ని ఘటనలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. చిన్న ఉదంతాలకే ప్రాణాలు తీయటం.. తీసుకునే ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి షాకింగ్ క్రైం ఒకటి జోగిపేటలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. ఇలాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వారంతా ముప్ఫై ఏళ్ల లోపు వారే ఉండటం గమనార్హం. అసలేం జరిగిందంటే..
జోగిపేటకు చెందిన 24 ఏళ్ల నాగరాజుకు తల్లిదండ్రులు లేరు. మేనమామ వద్ద ఉంటూ జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. కొద్దిరోజులుగా పాత ఇనుప సామాగ్రి షాపులో పని చేస్తున్నాడు. అక్కడే మరో దుకాణంలో పని చేస్తున్న పద్నాలుగేళ్ల బాలుడితో పరిచయమైంది. ఇద్దరు కలిసి చిన్న చోరీలు చేసేవారు. బాలుడు పని చేస్తున్న దుకాణం నుంచి కాపర్ తీగను దొంగలించి.. నాగరాజు పని చేస్తున్న షాపులో అమ్మారు. దీంతో వారికి రూ.20వేలు వచ్చాయి.
ఆ డబ్బుల్ని పంచుకునే విషయంలో గొడవ జరిగింది. దీంతో బాలుడి మీద కక్ష పెంచుకున్న నాగరాజు.. మాయమాటలతో అతడ్ని చెరువు వద్దకు తీసుకెళ్లి.. అక్కడే గొంతు నులిమి హత్య చేశాడు. డెడ్ బాడీని సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశాడు. స్థానికంగా ఉన్న ఒక చిరు వ్యాపారి మీదా దాడికి పాల్పడ్డాడు. ఆ వ్యాపారిని డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. ఇవ్వనని చెప్పటంతో అతడి తలపై ఇనుప రాడ్ తో కొట్టి గాయపర్చాడు.
ఆవేశంతో ఇవన్నీ చేసిన అతను.. ఆ తర్వాత భయాందోళనలకు గురై ఒక సెల్ టవర్ ఎక్కి.. ఫోన్ ద్వారా ఫ్రెండ్ కు కాల్ చేసి తాను చేసిందంతా చెప్పాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సెల్ టవర్ వద్దకు వచ్చి కిందకు దిగాలని కోరారు. అయినా దిగలేదు. బాలుడి తల్లి వచ్చి.. తమ పిల్లాడు ఎక్కడని అడిగితే.. చంపేసి బావిలో పడేసినట్లుగా చెప్పటంతో.. అక్కడకు గజఈతగాళ్లను తీసుకెళ్లి డెడ్ బాడీని వెలికి తీశారు.
టవర్ మీద ఉన్న నాగరాజు ఎంతకు కిందకు దిగి రాకపోవటంతో.. డ్రోన్ల ద్వారా అతడి కదలికల్ని గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతను కేబుల్ వైర్లతో మెడకు చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. దీంతో.. ఇద్దరు వ్యక్తులను పైకి పంపించి డెడ్ బాడీని కిందకు దింపారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. అత్యాశ.. అవసరానికి మించిన కోపం.. ఆగ్రహం ఒక నిండు ప్రాణాన్ని తీయటమే కాదు.. తన ప్రాణాల్ని తీసుకునేలా చేసింది.