Begin typing your search above and press return to search.

అమెరికా లో కాదు ఇక్కడే తుపాకీతో స్కూల్‌ కు నర్సరీ పిల్లాడు!

ఇందులో గన్ పేల్చింది నర్సరీ పిల్లవాడు కాగా.. బాధితుడు మూడో తరగతి పిల్లాడు.

By:  Tupaki Desk   |   1 Aug 2024 2:30 AM GMT
అమెరికా లో కాదు ఇక్కడే  తుపాకీతో స్కూల్‌  కు నర్సరీ పిల్లాడు!
X

సాధారణంగా అమెరికా కాలేజీలో కాల్పులు, హైస్కూళ్లలో తుపాకీ చప్పుళ్లు వంటి వార్తలు రెగ్యులర్ గా వినిపిస్తుంటాయి. అయితే భారత్ లో కూడా ఇకపై ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందేమో అనే సందేహం కలిగించే ఘటన ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో గన్ పేల్చింది నర్సరీ పిల్లవాడు కాగా.. బాధితుడు మూడో తరగతి పిల్లాడు. జరిగింది బీహార్ లో!

అవును.. బీహార్ లోని ఓ పాఠశాలలో అనూహ్య ఘటన జరిగింది. దీన్ని.. ఎవరూ ఊహించని ఘటన అంటూనే, భవిష్యత్తుపై కొత్త ఆందోళనలను కలిగిస్తోందని చెబుతున్నారు. అందుకు కారణం.. ఓ ఐదేళ్ల పిల్లవాడు స్కూల్ కి తుపాకీతో వెళ్లాడు. తనకంటే పెద్దవాడైన మూడో తరగతి చదువుతున్న విద్యార్థిపై కాల్పులు జరిపాడు.

వివరాళ్లోకి వెళ్తే... బీహార్ లోని సుపౌల్ జిల్లాలో నర్సరీ చదువుతున్న ఐదేళ్ల పిల్లవాడు బ్యాగులో తుపాకీ పెట్టుకుని స్కూలుకి వెళ్లాడు. ఈ సమయంలో మూడో తరగతి చదువుతున్న మరో పిల్లాడిపై కాల్పులు జరిపాడు. దీంతో... తీవ్రగాయాలైన ఆ మూడో తరగతి చదువుతున్న బాధిత బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో... ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో... తమ పిల్లల భద్రతపై తల్లితండ్రులు పాఠశాల ముందు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో... సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ స్కూల్ ప్రిన్సిపల్ ను అరెస్ట్ చేశారు. అనంతరం... అసలు ఈ పిల్లాడి చేతికి తుపాకీ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు!

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇకపై విద్యార్థుల బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలని జిల్లాలోని అన్ని పాఠశాలలనూ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోపక్క ఈ తుపాకీ ఆ నర్సరీ చదువుతున్న బాలుడి తండ్రిది అయ్యి ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు!