టీడీపీ కోటాలో గవర్నర్ గా ఆయన పేరు కన్ ఫర్మ్ ?
నూటికి తొంభై శాతం అశోక్ గజపతిరాజుకే గవర్నర్ పదవి ఆఫర్ ఉందని అంటున్నారు. బాబు కూడా ఆయన పేరునే ప్రతిపాదించవచ్చు అని చెబుతున్నారు.
By: Tupaki Desk | 25 Dec 2024 5:30 PM GMTదేశంలో అరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకాలను కేంద్ర ప్రభుత్వం తాగా చేసింది.కేరళ గవర్నర్ గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరాం గవర్నర్ గా విజయ్ కుమార్ సింగ్, బీహర్ గవర్నర్ గా అరిఫ్ అహ్మద్, మణిపూర్ గవర్నర్ గా కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన అజయ్ కుమార్ భల్లాను నియమించారు. ఏపీకి చెందిన హరిబాబుకి ఒడిషా గవర్నర్ గా ప్రమోషన్ ఇచ్చారు.
దాంతో ఇపుడు అందరి దృష్టి టీడీపీ మీద పడింది. ఆ పార్టీ నుంచి ఒకరికి గవర్నర్ గా అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీకి ఆఫర్ ఇచ్చింది అని అంటున్నారు. మిత్రుల కోటాలో ఎన్డీయేలో రెండవ పెద్ద పార్టీ అయిన టీడీపీకి ఒక గవర్నర్ పదవి కచ్చితంగా దక్కుతుంది అని అంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయమే తరువాయి అని అంటున్నారు. ఆయన ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారే దేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారు. దాంతో ఇపుడు బాబు ఏమి చేయబోతున్నారు అని అంతా చర్చిస్తున్నారు. చంద్రబాబు గవర్నర్ పదవి కోసం ఎవరి పేరుని ప్రతిపాదిస్తారు అన్నది అయితే ఆసక్తికరంగా ఉంది.
సాధారణంగా గవర్నర్ పదవి అంటే రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్న వారిని ఎంచుకుంటారు. అంతే కాదు రాజకీయంగా సీనియర్ నేతగా ఉంటూ అనేక పదవులు నిర్వహించిన వారికి అనుభవం ఉన్న వారికి ఈ చాన్స్ దక్కుతుంది. అలా చూసుకుంటే బాబు మనసులో ఇద్దరి పేర్లు ఉన్నాయని అంటున్నారు.
ఒకరి పేరు మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఒక్క 2024లో తప్పించి టీడీపీ ఎపుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు కేబినెట్ బెర్త్ గ్యారంటీ అన్నది అందరికీ తెలిసిందే. అత్యధిక కాలం ఆర్ధిక మంత్రిగా ఆయన వ్యవహరించారు. స్పీకర్ గా పనిచేశారు. పాలన రాజ్యాంగం పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉంది. రాజకీయ మేధావిగా ఉన్నారు.
దాంతో పాటు సామాజిక సమీకరణలు ఆయనకు కలసివస్తాయని అంటున్నారు. అయితే కాకినాడ పోర్టు విషయంలో ఆయన ఇటీవల చంద్రబాబుకు రాసిన ఒక బహిరంగ లేఖ వల్ల కొంత ఇబ్బంది అయితే వచ్చింది. దానిని లైట్ తీసుకుంటూ ఆయన పేరుని పరిగణనలోకి తీసుకుంటారా అన్నది చర్చగా ఉంది.
ఇక రెండవవారు కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రిగా పనిచేసిన వారు. విశేష అనుభవం కలిగిన వారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు అర్ధ శతాబ్దం పాటు రాజకీయ అనుభవం కలిగిన నేతగా ఉన్నారు. ఆయన కూడా టీడీపీ ఎపుడు గెలిచినా కీలక మంత్రిత్వ శాఖలు చూసిన వారుగా ఉన్నారు. రాజ్యాంగం పట్ల సాధారణ పరిపాలన పట్ల పూర్తి అవగాహన ఆయనకు ఉంది.
పైగా చూస్తే క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఈసారి ఎవరికీ మంత్రిగా తీసుకోలేదు. దాంతో రాజుకు గవర్నర్ పదవిని ఇచ్చేందుకే అలా చేశారు అని అంటున్నారు. ఇక చూస్తే ఆయన పార్టీకి సదా విధేయుడిగా ఉన్నారు. ఎపుడూ ఆయన మాట జారింది లేదు అని గుర్తు చేస్తున్నారు
ఆయనకు టీటీడీ చైర్మన్ గా నియమించాలని అనుకున్నా ఆయన వద్దు అని సున్నితంగా పక్కన పెట్టేశారు. ఆయనకు గవర్నర్ గా పనిచేసి సంతృప్తికరమైన గౌరవమైన పదవీ విరమణ చేయాలని ఉందని అంటున్నారు. ఇక కేంద్రంలో నాలుగున్నరేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన ఆయన పనితీరు నిబద్ధత గురించి ప్రధాని మోడీకి కూడా బాగా తెలుసు అంటున్నారు.
ఆయనకు గవర్నర్ పదవి అంటే మోడీ సహా కేంద్ర పెద్దలు కూడా పూర్తి స్థాయిలో హర్షించడమే కాకుండా కీలకమైన రాష్ట్రానికి నియామకం చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో ఉన్న బాబుకు గవర్నర్ పదవి టీడీపీ కోటాలో అయితే ఆఫర్ గా ఇచ్చారు అని ప్రచారం సాగుతోంది.
బాబు ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారికే రాజ్ భవన్ లోకి ప్రవేసించే చాన్స్ అని అంటున్నారు. నూటికి తొంభై శాతం అశోక్ గజపతిరాజుకే గవర్నర్ పదవి ఆఫర్ ఉందని అంటున్నారు. బాబు కూడా ఆయన పేరునే ప్రతిపాదించవచ్చు అని చెబుతున్నారు. అదే కనుక జరిగితే రాజు గారు గవర్నర్ గా రాజ ఠీవితో రాజ్ భవన్ లోకి అడుగుపెడతారు అని అంటున్నారు.