విజయనగరంలో మళ్లీ ఈ ఇద్దరేనా...!?
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పాత ప్రత్యర్ధులే మరో మారు తలపడనున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే చెబుతున్నాయి.
By: Tupaki Desk | 1 Feb 2024 4:30 AM GMTవిజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పాత ప్రత్యర్ధులే మరో మారు తలపడనున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో విజయనగరం సీటు నుంచి వైసీపీ తరఫున కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తే టీడీపీ తరఫున అదితి గజపతిరాజు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా వీచడంతో రాజు గారి అమ్మాయిని సైతం పక్కన పెట్టి ఫ్యాన్ పార్టీకి జనాలు జేజేలు కొట్టారు.
అలా తొలిసారి పోటీ చేసిన అతిది గజపతిరాజు ఓటమి చవిచూసారు. అదే సమయంలో 2004లో తండ్రి అశోక్ గజపతిరాజుని, 2019 ఎన్నికల్లో ఆయన కుమార్తె అదితి గజపతిరాజుని ఓడించిన ఘనతను మాత్రం కోలగట్ల దక్కించుకున్నారు ఇపుడు అయిదేళ్ల కాలం గిర్రున తిరిగింది.
ఈసారి కూడా ఈ ఇద్దరి మధ్యనే పోటీ ఉండవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే అశోక్ గజపతిరాజుకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అధినాయకత్వం ఇచ్చినా ఆయన తన కుమార్తెనే పోటీలో ఉంచాలని చూస్తున్నారు తాను ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారు.
అందుకే అదితి విజయనగరం అసెంబ్లీ పరిధిలో చురుకుగా తిరుగుతున్నారు. ఆమె అనేక రకాలుగా పార్టీ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. చంద్రబాబు సైతం అశోక్ మాటను మన్నించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంతున్నారు. మరో వైపు చూస్తే కోలగట్లకు వైసీపీ మళ్లీ చాన్స్ ఇచ్చేలాగానే ఉంది. వైశ్య సామాజిక వర్గం కోటాతో పాటు అంగబలం అర్ధబలం కలిగిన కోలగట్లను విజయనగరం నుంచి పోటీకి దించితే ఆయన సామాజికవర్గంతో పాటు తూర్పు కాపుల మద్దతు కూడా దక్కే సూచనలు ఉన్నాయని అంటున్నారు.
దీంతో టీడీపీ వైసీపీల మధ్య ఈసారి భీకరంగా పోరు సాగనుంది అని అంటున్నారు. ఆనాడు ఎన్నికలకు కొత్త అయిన అదితి ఓటమి పాలు అయ్యారు. కానీ అయిదేళ్ల పాటు ఆమె జనంలో ఉంటూ వచ్చారు. టీడీపీ కూడా గతంతో పోలిస్తే బాగానే పుంజుకుంది. దాంతో అదితికి ఈసారి అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు అని టీడీపీ భావిస్తోంది. ఉప సభాపతిగా ఉంటూనే జనంలో కలగలసిపోతూ విజయనగరం అభివృద్ధి విషయంలో గట్టిగా పనిచేసిన కోలగట్లకు తప్పకుండా జనాలు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి వెళ్లే చాన్స్ ఇస్తారని ఆయన వర్గం అంటోంది.
ఇంకో వైపు చూస్తే విజయనగరం జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. ఒకటి రెండు సీట్లలో టఫ్ గా కాంపిటేషన్ ఉన్నా మెజారిటీ సీట్లు గెలుస్తామని అంటున్నారు. ఆ ప్రభావం విజయనగరం మీద కూడా పడుతుందని కోలగట్ల మళ్లీ గెలుపు గుర్రం ఎక్కుతారు అని అంటున్నారు. చూడాలి మరి సైకిల్ పరుగులు తీస్తుందా లేక ఫ్యాన్ గిర్రున తిరుగుతుందా అన్నది జనం తీర్పును బట్టి అంటున్నారు.