Begin typing your search above and press return to search.

బాబుకు భారీ షాక్ ఇచ్చిన అశోక్...!?

టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్ తగులుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని చెబుతున్నాయి

By:  Tupaki Desk   |   11 Feb 2024 3:57 AM GMT
బాబుకు భారీ షాక్ ఇచ్చిన అశోక్...!?
X

టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్ తగులుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని చెబుతున్నాయి. విజయనగరంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పూసపాటి సంస్థానానికి వారసుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా పనిచేసి దశాబ్దాల రాజకీయ జీవితాన్ని చూసిన అశోక్ గజపతి రాజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఆయన తాను ఇక రాజకీయాలలో ఉండలేను అంటూ స్వచ్చందంగా తప్పుకుంటున్నారు. ఆయన తాను మాత్రమే కాదు తన కుమార్తె అదితి గజపతిరాజుని కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించకూడదు అని షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇక చాలు స్వస్తి అనేస్తున్నారు. పెద్దాయన ఈ రకంగా రాజకీయ వైరాగ్యం ప్రకటించడం వెనక ఏమి కారణాలు ఉన్నాయని ఆరా తీస్తే చాలా అని అంటున్నారు.

రాజు గారి వయసు ఏడు పదులు దాటింది. ఆయన ఈసారికి తన కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ టికెట్ ఇప్పించాలనుకున్నారు. తన వారసురాలిగా ఆమెను ముందు పెట్టి తాను రిటైర్ కావాలని చూస్తున్నారు. ఒకవేళ అధినాయకత్వం బలవంతం పెడితే ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. అలా రెండు సీట్లు తమకు ఇస్తే పోటీకి సిద్ధం అని సంకేతాలు పంపారు. హై కమాండ్ ని కోరారు కూడా అని ప్రచారం సాగుతోంది

అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం అశోక్ ని విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయమని అంటోంది. ఆయన కుమార్తెకి విజయనగరం అసెంబ్లీ టికెట్ కి నో చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ సీటులో వారికి టికెట్ ఇవ్వాలని చూస్తోంది అని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అక్కడ టికెట్ కోసం చూస్తున్నారు. ఆమె తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళా నాయకురాలు. ఆమె 2014లో ఇదే సీటు నుంచి గెలిచారు.

అయితే అశోక్ విజయనగరం అసెంబ్లీ సీటుని వదులుకోవాలని అనుకోవడంలేదు. 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసినపుడు ఎమ్మెల్యే సీటు గీతకు ఇచ్చారు. అలా విజయనగరం రాజకీయాల్లో రాజు గారి పట్టు తప్పింది. దాంతో ఆయన ఎట్టి పరిస్థితులలోనూ అసెంబ్లీ సీటుని కోరుతున్నారు. కానీ హై కమాండ్ మాత్రం ఆయన కుమార్తెని పక్కన పెట్టాలని చూస్తోంది. పైగా రెండు టికెట్లు ఒకే కుటుంబానికి ఇవ్వబోమని కొత్త విధానం అమలు చేస్తున్నారు.

దీంతో విసిగిన అశోక్ గజపతిరాజు ఇక ఈ రాజకీయాలు చాలు అని అంటున్నారు అని తెలుస్తోంది. తాను తన కుటుంబం ఇక రాజకీయాల్లో ఉండబోమని పెద్దాయన ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. ఇది ఒక విధంగా టీడీపీకి షాక్ లాంటిదే. విజయనగరంలో పూసపాటి రాజులకు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా జనంలో పేరుంది.

అదే విధంగా 1978 నుంచి అశోక్ ఎమ్మెల్యేగా గెలుస్తూ రాజకీయాల్లో ఉన్నారు. ఇపుడు తన వారసురాలికి ఒక్క టికెట్ ఇప్పించుకోలేని రాజకీయం ఎందుకు అన్నది పెద్దాయన బాధగా ఉంది. అశోక్ కి ఈసారి ఎంపీ ఇచ్చి ఆ విధంగా ఆయన ఇమేజ్ తో విజయనగరం జిల్లాలో సీట్లు గెలుచుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. అశోక్ కి తప్ప ఆయన కుటుంబానికి రాజకీయంగా ప్రోత్సాహం అయితే టీడీపీ నుంచి దక్కడంలేదు. పోనీ అశోక్ కి అయినా అసెంబ్లీ సీటు కాకుండా ఎంపీ సీటు చూపిస్తున్నారు అని అంటున్నారు. దాంతోనే పెద్దాయన రాజకీయాల పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు.

ఇపుడు మనసు మార్చుకుని అశోక్ రాజకీయంగా క్రియాశీలం అవుతారా అంటే ఆయనకు కానీ ఆయన కుమార్తెకు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. మరి టీడీపీ హై కమాండ్ మాత్రం ఆ విధంగా ఆలోచిస్తుందా అన్నది చూడాలి మొత్తానికి బాబుకు అశోక్ బిగ్ షాక్ ఇచ్చేశారు అని అంటున్నారు.