బంగ్లా పాలిటిక్స్ : అశోక్ వర్సెస్ ఆ ఇద్దరూ ?
విజయనగరంలో మళ్ళీ అశోక్ బంగ్లా పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 13 July 2024 4:26 AM GMTవిజయనగరంలో మళ్ళీ అశోక్ బంగ్లా పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పూసపాటి అశోక్ గజపతిరాజు జిల్లా టీడీపీని తన కనుసన్నలలో నడిపిస్తున్నారు. ఆయన హవా స్పష్టంగా కనిపిస్తోంది. తాను అనుకున్న వారికే ఇద్దరికి మంత్రి పదవులు ఇప్పించుకున్నారు అని టాక్. అలాగే తాను వద్దు అనుకున్న వారిని దూరంగా పెట్టగలిగారు అన్నది కూడా మరో మాట.
విజయనగరం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉంటే వారిలో మెజారిటీ అంతా అశోక్ వెంటే ఉంది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అశోక్ మాటే వేదవాక్కుగా ముందుకు సాగుతారు. అలాగే తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కొండపల్లి శ్రీనివాస్ కి మంత్రి పదవి దక్కింది. ఆయనకు టికెట్ ఇప్పించడం దగ్గర నుంచి మంత్రి దాకా అంతా అశోక్ దగ్గరుండి చూశారు అని అంటారు.
అలాగే సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణి కి మంత్రి పదవి సైతం రాజు గారి చలవే అని చెప్పుకుంటారు. తాజాగా అశోక్ బంగ్లాలో పెద్దాయన టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీతో పాటు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశంలో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప అంతా హాజరయ్యారు. ఆ ఇద్దరే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. అలాగే మరో సంస్థానాధీశుడు బొబ్బిలి రాజు, ఎమ్మెల్యే అయిన బేబీ నాయన. ఈ ఇద్దరూ మంత్రి పదవి కోసం ఆశలు పెంచుకున్న వారే. అయితే వారికి పదవి దక్కలేదు. దాంతో తమ నేతలకు పదవి దక్కకపోవడం వెనక కొందరు చక్రం తిప్పారు అని వారి అనుచరులు భావిస్తున్న సందర్భమూ ఉంది. బేబీ నాయన అయితే తాను ఉన్నత విద్యావంతుడిని కాకపోవడం వల్లనే మంత్రి పదవి దక్కలేదని ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
ఇక రాజకీయాల పట్ల గత కొంతకాలంగా వైరాగ్యంగా ఉన్న అశోక్ తాజా ఎన్నికల్లో మాత్రం తనదైన వ్యూహాలతో చాతుర్యం చూపించారు అభ్యర్థుల ఎంపికలోనూ అధినాయకత్వం వద్ద పట్టు నిలుపుకున్నారు. దాంతో ఆయన జిల్లా టీడీపీ రాజకీయాలను శాసిస్తున్నారు అని అంటున్నారు.
ఈ పరిణామాల క్రమంలో అశోక్ బంగ్లా పాలిటిక్స్ కి దూరంగా ఉన్న ఆ ఇద్దరి మీద అందరి చూపూ ఉంది. వారు ఏమి చేస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. ఏపీలో టీడీపీకి తిరుగులేని పరిస్థితుల నేపధ్యంలో ఎవరు ఎలాంటి అసంతృప్తిని వ్యక్తం చేసినా కూడా అది ఫలించకపోగా బూమరాంగ్ అవుతుందనే అంటున్నారు. మొత్తానికి రాజు గారి కోట మళ్ళీ కళకళలాడుతోంది. రానున్న రోజులలో అశోక్ కి రాజ్యసభ లేదా గవర్నర్ పదవులలో ఏదో ఒకటి దక్కడం ఖాయమని కూడా అంటున్నారు.