ఈ సీనియర్ నేత పంతం.. కుమార్తెకు చేటు చేసేనా?
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేశారు. అయితే విజయనగరం అసెంబ్లీ సీటును టీడీపీ మహిళా నేత మీసాల గీత కూడా ఆశించారు.
By: Tupaki Desk | 21 May 2024 7:40 AM GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసి ఈవీఎంల్లో ఓట్లు నిక్షిప్తమయ్యాయి. గెలిచేదెవరో జూన్ 4న తేలనుంది. అప్పటివరకు అందరిలోనూ ఉత్కంఠ తప్పదు. కాగా టీడీపీలో ఒక సీనియర్ నేత పంతం ఆయన కుమార్తెకు చేటు చేసే ప్రమాదం ఉందని టాక్ నడుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, టీడీపీ తరఫున సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేశారు. అయితే విజయనగరం అసెంబ్లీ సీటును టీడీపీ మహిళా నేత మీసాల గీత కూడా ఆశించారు. అందులోనూ గీత గతంలో మున్సిపల్ చైర్మన్ గా, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అయితే అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమార్తెకు సీటు ఇప్పించుకున్నారు. దీంతో అదితి గజపతిరాజు టీడీపీ తరఫున బరిలో నిలిచారు. మరోవైపు సీటు ఆశించిన మీసాల గీత రెబల్ గా పోటీ చేశారు. ఆమెను పోటీ నుంచి తప్పించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తదితరులు ప్రయత్నించినా మీసాల గీత అంగీకరించలేదని సమాచారం.
టీడీపీ అధికారంలోకి వచ్చాక మీసాల గీతకు ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని ఆమెకు టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కొంత మెత్తబడ్డ మీసాల గీత.. తన వద్దకు అశోక్ గజపతిరాజు వచ్చి మద్దతు అడగాలని, లేదా కనీసం తనకు ఫోన్ చేసైనా తన మద్దతును అర్థించాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు అశోక్ గజపతిరాజు ఇష్టపడలేదని టాక్. గతంలో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తి ఇక మీసాల గీత మద్దతు ఎలా కోరతారు!?
తన కుమార్తె గెలిస్తే గెలుస్తుందని.. లేదంటే ఓడిపోతుందని.. మీసాల గీతను కలిసి మద్దతు అడగబోనని అశోక్ గజపతిరాజు తేల్చిచెప్పారు. దీంతో గీత రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు గాజు గ్లాసు గుర్తు దక్కింది. వాస్తవానికి జనసేన పార్టీ అక్కడ బరిలో లేదు. అయితే జనసేనకు గుర్తింపు లేకపోవడం వల్ల గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది. దీంతో మీసాల గీత ఆ గుర్తును ఎంచుకోవడంతో ఆమెకు దక్కింది.
దీంతో విజయనగరంలో ముక్కోణపు పోటీ జరిగింది. గతంలో మున్సిపల్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా మీసాల గీత పనిచేసి ఉండటంతో ఆమెకు విస్తృత పరిచయాలు ఉన్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా ఆమె పోటీ చేసి ఓడిపోయారు. ఈ విస్తృత పరిచయాలతో మీసాల గీత భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు గట్టి పోటీ నిచ్చారు. అందులోనూ ఆమెకు గాజు గ్లాసు గుర్తు లభించడంతో ఆమె పని మరింత తేలికైందని టాక్.
ఇంకోవైపు వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి వైశ్య కులానికి చెందినవారు. అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు. మీసాల గీత తూర్పు కాపు కులానికి చెందినవారు. తూర్పు కాపులు బీసీల కిందకు వస్తారు. విజయనగరంలో ఎక్కువ మంది ఈ సామాజికవర్గం వారే ఉన్నారు. దీంతో మీసాల గీత విజయంపైన ఎక్కువ ఆశలే పెట్టుకున్నారని టాక్ నడుస్తోంది. అశోక్ గజపతిరాజు పంతానికి పోకుండా ఆమెను కలిసి మద్దతు అడిగి ఉంటే ఆమె పోటీ చేసి ఉండేవారు కాదని.. అదితి గెలుపుకు ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు. మరి అసలు ఫలితం ఏమిటో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.