నాలుగోసారి కూడా నన్నే ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు: కాంగ్రెస్‌లో కొత్త లొల్లి
దేవుడి దయతో తనను నాలుగోసారి ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్రంలో మహిళలు కోరుకుంటున్నారని అశోక్ గెహ్లాట్ తాజాగా వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 19 Oct 2023 11:30 PM GMTఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానేలేదు. పైగా.. ప్రజలు తమకే అండగా ఉంటారన్న గ్యారెంటీ కూడా లేదు. అయితే మాత్రం ఏం.. ముందుగానే ముఖ్యమంత్రి పీఠానికి ముళ్లు వేసేశారు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ప్రస్తుతం ఆయన మూడు సార్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న విషయం తెలిసిందే. గతంలోనూ ఆయన కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా ఏలారు.
ఇక, ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో రాజస్థాన్ కూడా ఉంది. నవంబరు 7 నుంచి ఇక్కడ కూడా నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. డిసెంబరు 3న ఫలితం వెలువడ నుంది. అయితే.. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కోసం.. కొన్నేళ్లుగా యువ నాయకుడు, రాహుల్ కూటమి నేతగా పేరొందిన సచిన్ పైలట్ పావులు కదుపుతున్నారు. అయితే.. సోనియా ఆశీస్సులు మెండుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎప్పటికప్పుడు.. తన సీటును కాపాడుకుంటూనే ఉన్నారు.
అయితే.. ప్రస్తుత ఎన్నికల్లో సచిన్ పైలట్ తన సత్తా చూపించి.. మరోసారి కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చి.. తాను సీఎం పీఠం ఎక్కాలనే కసితో పనిచేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఆయన ఆరు మాసాల ముందుగానే ఎన్నికల ప్రచారం చేపట్టారు. అయితే.. ఈ విషయాన్ని గమనించిన సీఎం అశోక్ గెహ్లాట్ తెలివిగా సచిన్ ముందర కాళ్లకు బంధం వేస్తున్నారు.
దేవుడి దయతో తనను నాలుగోసారి ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్రంలో మహిళలు కోరుకుంటున్నారని అశోక్ గెహ్లాట్ తాజాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నప్పటికీ.. ఆ సీటే తనను అంటిపెట్టుకుని వదలడం లేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కూడా తనని విడిచిపెట్టదని ప్రజలు భావిస్తున్నారని అశోక్ వ్యాఖ్యానించారు.
తనలో ఏదో శక్తి ఉందని, అందుకే పార్టీ హైకమాండ్ తనను రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి మూడుసార్లు ఎంపిక చేసిందని అశోక్ గెహ్లాట్ చెప్పడం గమనార్హం. అన్నారు. అయితే..హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయమైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ పరిణామాలను గమనించిన రాజకీయ పండితులు మాత్రం అశోక్ చాలా వ్యూహాత్మకంగా సచిన్ పైలట్‌కు ముందర కాళ్లకు బంధం వేస్తున్నారని అంటున్నారు. ఇది వికటిస్తే.. బీజేపీ పుంజుకుని ఏకంగా కాంగ్రెస్ అధికారం కోల్పోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.