మనోడికి అమెరికాలో అత్యుత్తమ అకడమిక్ అవార్డు
అమెరికాలోనే అత్యుత్తమ అకడమిక్ అవార్డును భారత సంతతికి చెందిన కంప్యూటర్ ఇంజినీర్.. ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్ సొంతం చేసుకున్నారు.
By: Tupaki Desk | 26 Feb 2024 4:43 AM GMTఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అమెరికాలో మనోళ్లు అదరగొట్టేస్తున్నారు. తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. అమెరికాలోనే అత్యుత్తమ అకడమిక్ అవార్డును భారత సంతతికి చెందిన కంప్యూటర్ ఇంజినీర్.. ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్ సొంతం చేసుకున్నారు. టెక్సాస్ అత్యుత్తమ అకడమిక్ అవార్డు 'ఎడిత్ అండ్ పీటర్ ఓడన్నెల్' ను ఆయన సొంతం చేసుకున్నారు. టెక్సాస్ రాష్ట్రంలో ఆయా రంగాల్లో ప్రతిభ చూపే ఔత్సాహిక పరిశోధకులకు ఈ సత్కారాన్ని అందజేస్తుంటారు.
ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో చేసిన కృషికి వీరరాఘవన్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇమేజింగ్ టెక్నాలజీలో ఆయన విప్లవాత్మక పరిశోధనలు చేశారు. వాటిని గుర్తించిన నేపథ్యంలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఇక.. వీర రాఘవన్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. చెన్నైలో పుట్టి పెరిగిన ఇతడు.. రైస్ విశ్వవిద్యాలయానికి చెందిన జార్జ్ ఆర్ బ్రౌన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
ఈ అవార్డును అందుకోవటం ఆనందంగా ఉందన్న ఆయన.. గడిచిన పదేళ్లుగా రైస్ వర్సిటీలోని ల్యాబుల్లో కంప్యూటేషనల్ ఇమేజింగ్ ల్యాబ్ లో ఎంతోమంది విద్యార్థులు చేస్తున్న పరిశోధనలకు దక్కిన గుర్తింపుగా పేర్కొన్నారు. ఇంతకూ ఈ ఇమేజింగ్ టెక్నాలజీ ఏమిటన్నది వ్యవహారిక భాషలో కాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే.. కాంతిని ప్రసరించే మాధ్యంలోని పరిమితుల కారణంగా ప్రస్తుత ఇమేజింగ్ టెక్నాలజీ విజువలైజేషన్ లక్ష్యానికి చేరుకోలేకపోతోంది. ఈ పరిమితులని పరిష్కరించే విషయంలో వీరరాఘవన్ పరిశోధనలు ఎంతో సాయం చేస్తున్నాయి.