మార్క్ జుకర్ బర్గ్ కామెంట్స్ పై బీజేపీ రియాక్షన్ ఇదే!
గత కొన్ని రోజులుగా మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నిర్ణయాలు, కామెంట్లు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Jan 2025 12:30 AM GMTగత కొన్ని రోజులుగా మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నిర్ణయాలు, కామెంట్లు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి పోస్టులు తీసేయాలని ఒత్తిడి చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ లో జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా కేంద్రమంత్రి రియాక్ట్ అయ్యారు.
అవును.. ఇటీవల లోక్ సభ ఎన్నికల ఫలితాలపై మార్క్ జుకర్ బర్గ్ చేసిన వాదనపై బీజేపీ నుంచి రియాక్షన్ వచ్చింది! ఈ సందర్భంగా.. జుకర్ బర్గ్ వాదనను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోసిపుచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో.. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ పై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి గెలిపించారి చెప్పుకొచ్చారు!
గత ఏడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్ బర్గ్ తప్పుగా చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో గత ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని అన్నారు.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని చెప్పుకొచ్చిన అశ్వినీ వైష్ణవ్... కోవిడ్-19 తర్వాత భారత్ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయి అని జుకర్ బర్గ్ చెప్పడంలో వాస్తవం ఏమాత్రం లేదని వెల్లడించారు. ప్రధానంగా కోవిడ్ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220 కోట్ల వ్యాక్సిన్లు అందించారని అన్నారు.
ఇదే సమయంలో... కోవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయడం వంటి నిర్ణయాలే మోడీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయని అన్నారు. ఈ సందర్భంగా... మార్క్ జుకర్ బర్గ్ అలా మాట్లాడటం తీవ్ర నిరాశనకు గురిచేసిందని.. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామని మెటాను ట్యాగ్ చేస్తూ మంత్రి వైష్ణవ్ ట్వీట్ చేశారు.