Begin typing your search above and press return to search.

అశ్వినీదత్ డ్యామేజ్ కంట్రోల్

ఈ విషయం వివాదాస్పదంగా మారి, పవన్‌కు ఇబ్బంది తెచ్చి పెట్టడంతో అశ్వినీదత్ తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

By:  Tupaki Desk   |   5 July 2024 10:44 PM IST
అశ్వినీదత్ డ్యామేజ్ కంట్రోల్
X

సినిమా వేడుకల్లో, ఇంటర్వ్యూల్లో చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటారు సీనియర్ నిర్మాత అశ్వినీదత్. ఈ క్రమంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అవుతుంటాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యథాలాపంగా ఆయన చెప్పిన విషయాలు వివాదానికి దారి తీశాయి. ఇటీవల సినీ పెద్దలు కొందరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించిన సంగతి తెలిసిందే.

ఐతే ఆ సమయంలో పవన్ తమకో సూచన చేశారని.. ఢిల్లీ, ముంబయిల్లో మాదిరి రూ.1000-1500తో మన దగ్గరా సినిమా టికెట్లకు ఫ్లెక్సీ ప్రైసింగ్ పెడితే ఎలా ఉంటుందని అన్నారని.. కానీ అది మనకు సరిపడదని తిరస్కరించామని దత్ పేర్కొనగా.. పవన్ సామాన్యుల గురించి ఆలోచించకుండా ఇలాంటి సూచన ఎలా చేస్తారంటూ ఆయన మీద విమర్శలు గుప్పించారు నెటిజన్లు.

ఈ విషయం వివాదాస్పదంగా మారి, పవన్‌కు ఇబ్బంది తెచ్చి పెట్టడంతో అశ్వినీదత్ తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల పెంపుదల గురించి అనవసరపు అపోహలు వస్తున్నాయి.

సినిమా రేట్ల పెంపుదల కోసం ప్రతిసారీ ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఓ శాశ్వతమైన ప్రతిపాదన చేయాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిలాష. నిర్మాతలంతా కూర్చుని, కూలంకషంగా చర్చించుకుని, సినిమా బడ్జెట్‌ను బట్టి టికెట్ల రేట్లు ఎంత వరకూ పెంచుకోవచ్చు, అది ఒక వారమా, పది రోజులా? అనే విషయంపై నిర్మాతలు ఒక నిర్ణయానికి వస్తే, గౌరవ ముఖ్యమంత్రి CBN గారు, తాను స్వయంగా చర్చిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

అన్ని వర్గాల వారికి, ప్రేక్షకులకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకుందామని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆయన నిర్మాతలందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు’’ అని దత్ పేర్కొన్నారు.