Begin typing your search above and press return to search.

తెలంగాణ గవర్నర్‌ గా మోదీకి అత్యంత సన్నిహితుడు!

తెలంగాణ గవర్నర్‌ గా ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన బీహార్‌ బీజేపీ నేత అశ్వినీకుమార్‌ చౌబే రానున్నట్టు టాక్‌ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 5:46 AM GMT
తెలంగాణ గవర్నర్‌ గా మోదీకి అత్యంత సన్నిహితుడు!
X

తెలంగాణ గవర్నర్‌ గా ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన బీహార్‌ బీజేపీ నేత అశ్వినీకుమార్‌ చౌబే రానున్నట్టు టాక్‌ నడుస్తోంది. అశ్వినీ కుమార్‌ చౌబే గత ఐదు దశాబ్దాలుగా బీజేపీలో ఉన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు లోక్‌ సభ ఎంపీగా విజయం సాధించారు. 2014లో బీహార్‌ లోని బక్సార్‌ నుంచి తొలిసారి బీజేపీ ఎంపీగా విజయం సాధించారు. ప్రధాని మోదీ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017 నుంచి 2021 వరకు ఈ బాధ్యతల్లో ఉన్నారు.

ఆ తర్వాత 2021 నుంచి 2024 వరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు.

2012లో బీహార్‌ లో నితీశ్‌ కుమార్‌ కేబినెట్‌ లోనూ అశ్వినీ కుమార్‌ చౌబే ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఈ ఏడాది జనవరికి 70 ఏళ్లు నిండటంతో బీజేపీ అధిష్టానం పెట్టుకున్న నిబంధన మేరకు ఆయనకు ఈసారి ఎంపీ సీటు ఇవ్వలేదు.

2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు బక్సార్‌ నుంచి అశ్వినీ కుమార్‌ ఎంపీగా గెలుపొందారు. ఈసారి ఆయనకు సీటు ఇవ్వకపోవడంతో బక్సార్‌ లో లాలూప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో బీహార్‌ లో బీజేపీ సీనియర్‌ నేతగా ఉన్న అశ్వినీ కుమార్‌ చౌబేను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ గా పంపాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది బీహార్‌ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, ఈ నేపథ్యంలో కీలక నేతగా ఉన్న అశ్వినీ కుమార్‌ చౌబేను సంతృప్తి పర్చాల్సిన బాధ్యత బీజేపీ అధిష్టానంపై పడిందని అంటున్నారు.

తాజా ఎన్నికల్లో అశ్వినీ కుమార్‌ కు తిరిగి సీటు ఇవ్వకపోవడంతో ఆయనను కీలకమైన తెలంగాణ గవర్నర్‌ గా పంపాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్‌ లేరు. జార్ఖండ్‌ గవర్నర్‌ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ తెలంగాణ ఇంచార్జి గవర్నర్‌ గా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు తెలంగాణ గవర్నర్‌ గా ఉన్న తమిళి సై సౌందర్‌ రాజన్‌ తమిళనాడు నుంచి లోక్‌ సభకు పోటీ చేయడానికి తన పదవికి రాజీనామా చేశారు. ఆమె చెన్నై సౌత్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

మరోవైపు తెలంగాణ గవర్నర్‌ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నియమిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆయనను కర్ణాటక గవర్నర్‌ గా పంపుతారని టాక్‌ నడుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి వైఎస్సార్‌ జిల్లా రాజంపేట ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.