కర్నూలులో ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టు?
తాజాగా రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.
By: Tupaki Desk | 16 Jan 2025 11:30 PM GMTకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పలు భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. తాజాగా రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రిలయన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టుతో వేల కోట్ల పెట్టుబడులుతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
దేశంలోని అగ్రస్థాయి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు, క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్ కూడా కర్నూలులో భారీ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఓకే చెప్పింది.
రాష్ట్రంలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రిలయన్స్ నూ సన్ టెక్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కర్నూలును ఎంచుకుంది. ఇప్పటికే కర్నూలు ప్రాంతంలో గ్రీన్ టెక్ సంస్థ అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా సూర్య ఘర్ బిజిలీ మఫ్త్ యోజన పథకం కింద సోలార్ విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా వాడుకునేందుకు సోలార్ పవర్ జనరేషన్ దిశగా అడుగులు వేస్తోంది.
రిలయన్స్ న్యూ సన్ టెక్ సంస్థ ప్రతిపాదిస్తున్న సోలార్ ప్లాంట్ ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా చెబుతున్నారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో మొత్తం రెండు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు. ఇందులో ఒకటి 930 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కాగా, మరొకటి 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కలిసి రిలయన్స్ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోందని చెబుతున్నారు. 24 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి 25 ఏళ్లపాటు విద్యుత్ పంపిణీ చేయాలని ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి లభించనుంది.