Begin typing your search above and press return to search.

చైనా సహా ఆసియా దేశాలకు సరికొత్త సవాల్... భారత్ పరిస్థితి?

కాస్త అటు ఇటుగా ఇప్పుడు ప్రపంచమంతటా జనాభా సంక్షోభం మొదలైందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Jan 2025 3:45 AM GMT
చైనా సహా ఆసియా దేశాలకు సరికొత్త సవాల్... భారత్ పరిస్థితి?
X

కాస్త అటు ఇటుగా ఇప్పుడు ప్రపంచమంతటా జనాభా సంక్షోభం మొదలైందని అంటున్నారు. ప్రధానంగా ఆసియా దేశాల్లో.. ఓపక్క జనాభా క్షీణిస్తుండగా.. మరోపక్క వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చైనా సహా పలు ఆసియా దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లివి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని పరిస్థితి ఏమిటనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును.. చైనా సహా అనేక ఆసియా దేశాల్లో పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనేందుకు యువత ముందుకు రావడం లేదు. కాస్త అటు ఇటుగా ప్రపంచవ్యాప్తంగా యువత ఇప్పుడు ఈ దిశగానే ఆలోచిస్తున్నరని.. ఇదే ధోరణి పెరుగుతోందని అంటున్నారు. ఫలితంగా.. ఏ దేశంలో చూసినా జనాభా క్రమంగా తగ్గుతోంది.

ఉదాహరణకు.. 2024లో చైనా జనాభా 10.4 లక్షలు తగ్గగా... ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. ఇక జపాన్ విషయానికొస్తే.. సుమారు 15 ఏళ్లుగా వరుసగా తగ్గుముఖం పడుతూనే ఉంది. దక్షిణకొరియాలో 2023లో కాస్త పుంజుకున్నా మళ్లీ తగ్గింది. ఇటలీలో తొలిసారి 4 లక్షల కంటే తక్కువకు పడిపోయింది.

ఈ విధంగా సుమారు 63 దేశాలు, భూభాగాల్లో జనాభా తగ్గుదల ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరిందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇదే సమయంలో... మరో 30 ఏళ్లలో ఈ 63 దేశాల సరసన మరో 48 దేశాలు వచ్చి చేరతాయని ఐరాసా తెలిపింది. ప్రధానంగా చైనాలో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

దీంతో... ఈ సమస్యను అధిగమించేందుకు చైనా చేస్తోన్న ప్రయత్నాల్లో మగవాళ్ల రిటైర్మెంట్ వయసును పెంచడం ఒకటి. ఇందులో భాగంగా... పురుషుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 63 ఏళ్లకు పెంచింది చైనా. ఇదే సమయాల్లో ఫ్యాక్టరీ, బ్లూ కాలర్ ఉద్యోగాల్లో మహిళల రిటైర్మెంట్ వయసు 50 నుంచి 55, వైట్ కాలర్ జాబ్స్ లో 55 నుంచి 58 ఏళ్లకు పెంచింది.

ఇక ఇటలీ విషయానికొస్తే.. ఇక్కడ జనాభా నానాటికీ తగ్గిపోతోన్న పరిస్థితి. ఇక్కడ జనాభా 2023లో 5.94 కోట్లుండగా.. 2024లో 5.93 లక్షలకు తగ్గింది. ఇదే సమయంలో.. 2008లో వార్షిక జననాల సంఖ్య 5.77 లక్షలు ఉండగా.. 2023 నాటికి 3.8 లక్షలకు పడిపోయింది. ఏకీకరణ తర్వాత జననాల సంఖ్య క్షీణించడం ఇటలీలో ఇదే తొలిసారని అంటున్నారు.

ఇదే క్రమంలో జపాన్ లో 2008లో 12.8 కోట్లమంది జనాభా ఉండగా 2024 చివరినాటికి 12.5 కోట్లకు పడిపోయింది. ఇదే కొనసాగితే 2070 నాటికి 8.7 కోట్లకు పడిపోతుందని అంటున్నారు. మరోపక్క వృద్ధుల సంఖ్య కూడా జపాన్ ను కలవరపరుస్తోంది. ఇక్కడ ప్రతీ 10 మందిలో నలుగురు వృద్ధులే కావడం గమనార్హం.

ఇక.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించినందున రాబోయే మూడు దశాబ్ధాల వరకూ భారతదేశ జనాభా పెరుగుతుందని అంటున్నారు. అయితే.. ఆ తర్వాత క్షీణించడం ప్రారంభమవ్తుందని అంచనా వేస్తున్నారు. ఐరాస గణాంకాల ప్రకారం ప్రస్తుత భారత జనాభా 142.86 కోట్లు కాగా... 2050 నాటికి 166.8 కోట్లకు పెరూగుతుందని అంచనా!