Begin typing your search above and press return to search.

చిన్న థాంక్స్ కూడా .... షర్మిలక్కను పట్టించుకోరా...?

మరి ఇంత త్యాగం చేసిన షర్మిలక్కకు కాంగ్రెస్ నుంచి చిన్న థాంక్స్ కూడా రాలేదని అంటున్నారు రాహుల్ గాంధీకి రాసిన లేఖకు రిప్లై రాలేదు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   7 Nov 2023 3:30 PM GMT
చిన్న థాంక్స్ కూడా .... షర్మిలక్కను పట్టించుకోరా...?
X

అదేంటో అవుట్ రేట్ గా సపోర్ట్ ప్రకటించినా షర్మిలక్కను కాంగ్రెస్ లో ఎవరూ పట్టించుకోవడం లేదు అని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ గెలవాలని బలంగా కోరుకోవడమే కాకుండా ఆ పార్టీ ఓట్లు తాను చీల్చకూడదు అన్న మంచి ఉద్దేశ్యంతో ఏకంగా పోటీ నుంచే తప్పుకుంటున్నట్లుగా వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల నాలుగు రోజుల క్రితం ఆర్భాటంగా ప్రకటించారు.

ఆమె చేసిన ప్రకటన కూడా కాంగ్రెస్ కి ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆమె చెప్పినది ఏంటి అంటే అన్ని సర్వేలూ కాంగ్రెస్ గెలుస్తుంది అని చెబుతున్నాయని, కాంగ్రెస్ వైపు గాలి ఉందని, ఇలాంటి కీలకమైన తరుణంలో తమ పార్టీ కనుక పోటీ చేస్తే ఓట్లు చీలి కొంత ఇబ్బంది రావచ్చునని. అందువల్ల కేసీయార్ పాలన పోవాలంటే కాంగ్రెస్ పాలన రావాలంటే తాను పెద్ద మనసు చేసుకుని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆమె చెప్పారు.

అంటే కాంగ్రెస్ తెలంగాణాలో గెలిచి తీరాలన్నది ప్రజల అభిమతం, తన అభిమతం అని ఆమె అన్నారు. ఇలా వైఎస్ షర్మిల భారీ ప్రకటన ఇచ్చాక ఏకంగా కాంగ్రెస్ అగ్ర నేత అయిన రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లుగా తెలిసింది. తమ పార్టీ పోటీ నుంచి విరమించుకుని కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచిందని కూడా పేర్కొంది.

మరి ఇంత త్యాగం చేసిన షర్మిలక్కకు కాంగ్రెస్ నుంచి చిన్న థాంక్స్ కూడా రాలేదని అంటున్నారు రాహుల్ గాంధీకి రాసిన లేఖకు రిప్లై రాలేదు అని అంటున్నారు. ఇక పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి అయినా ఇది మంచి పరిణామం, మాకు మద్దతుగా నిలిచారు ధన్యవాదాలు అంటూ ఒక ట్వీట్ అయినా చేయలేదు ఎందుకు అన్న చర్చ వస్తోంది.

మరో వైపు చూస్తే పాలేరులో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం షర్మిల మద్దతు పట్ల ఒక్క మాట మాట్లాడలేదు. పై పెచ్చు ఆయన్ని శ్రీనన్నా అని షర్మిల పిలుస్తుంది. అలాంటిది ఆయన నుంచి కూడా ఏమీ లేదు అంటున్నారు

ఇక మద్దతు ప్రకటించాక తాజాగా లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల మీడియా సమావేశం పెట్టి పోటీ చేయడం కంటే త్యాగం గొప్పదని అన్నారు. అంతే కాదు తమ కుటుంబానికి సన్నిహితుడు కాబట్టి శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం తప్పుకున్నానని చెప్పారు కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నారు. అయినా హస్తం పార్టీ వైపు నుంచి నో సౌండ్ అంటున్నారు.

ఢిల్లీ నాయకులు కానీ లోకల్ లీడర్స్ కానీ ఎవరూ థాంక్స్ అన్న చిన్న మాట కూడా అనలేకపోతున్నారు అని వినిపిస్తోంది. మరి షర్మిల త్యాగానికి ఈ సైలెన్స్ మాత్రమే విలువా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. షర్మిల గురించి కాంగ్రెస్ ఏమనుకుంటోంది, ఎందుకు లైట్ తీసుకుంటోంది అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.

నిజానికి కాంగ్రెస్ కోదండరెడ్డి వంటి వారిని కలసి మరీ మద్దతు తీసుకుంటోంది. వారికి ధన్యవాదాలు చెబుతోంది. షర్మిల దాకా వచ్చేసరికి ఎందుకీ తేడా అని డౌట్లు వస్తున్నాయి. అయితే ఎక్కడ అంటే షర్మిలకు థాంక్స్ అని చెబితే రేపటి రోజున కాంగ్రెస్ విజయంలో ఆమె క్రెడిట్ కూడా తీసుకుంటారని, గెలిచిన తరువాత ఏమైనా కోరుతారని అందుకే దూరం పెడుతున్నారని అంటున్నారు.

మరో వైపు వైఎస్సార్టీపీకి పోటీ చేసేందుకు సరైన క్యాండిడేట్లు లేకనే విరమించుకున్నారని కూడా లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఎక్కడైనా త్యాగం గొప్పదే. కానీ గుర్తింపు లేని త్యాగానికి అర్ధం కూడా లేదు. మరి షర్మిల చేసిన త్యాగానికి అర్ధం పరమార్ధం దక్కాలీ అంటే కాంగ్రెస్ నేతలు నోరు విప్పాల్సిందే. కానీ కాంగ్రెస్ మౌనమే నా భాష అంటోంది. అయినా షర్మిలక్క కాంగ్రెస్ ని పదే పదే పొగుడుతున్నారు.