Begin typing your search above and press return to search.

అసోంలో ఆధార్ కార్డుల జారీకి సరికొత్త మార్గదర్శకాలు

అసోంలోకి అక్రమ వలసల్ని పూర్తిగా అరికట్టటంలో భాగంగానే ఆధార్ కార్డుల జారీ అంశంపై మరింత కఠినంగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   8 Sep 2024 7:30 AM GMT
అసోంలో ఆధార్ కార్డుల జారీకి సరికొత్త మార్గదర్శకాలు
X

ఆధార్ కార్డుల జారీకి దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై.. ఆధార్ కార్డుల జారీ చేయాలంటే ఇప్పటికే ఉన్న నిబంధనలకు తోడుగా.. జాతీయ పౌర నమోదు అదేనండి ఎన్ ఆర్ సీ అప్లికేషన్ నెంబరును కూడా సమర్పించాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ నుంచి భారీగా వస్తున్న అక్రమ వలసల్ని గుర్తించేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

తమ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాన్ని అక్టోబరు ఒకటి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. అసోంలోకి అక్రమ వలసల్ని పూర్తిగా అరికట్టటంలో భాగంగానే ఆధార్ కార్డుల జారీ అంశంపై మరింత కఠినంగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. ఇంతకూ ఆయన సర్కారు ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? దానికి దారి తీసిన కారణాల్ని చూస్తే.. రాష్ట్ర జనాభా కంటే కూడా ఆధార్ కార్డుల దరఖాస్తులు ఎక్కువగా ఉన్న వైనం ఆయన వరకు వెళ్లింది.

దీంతో.. దిద్దుబాటు చర్యలు చేపట్టాలని భావించిన హిమంత.. ఆధార్ కార్డుల జారీపై కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారు. ఆధార్ కార్డులు అధికంగా ఉండటంపై ఆయన స్పందిస్తూ.. అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్లు అర్థమవుతుందని తేల్చేశారు. అందుకే.. ఎన్ ఆర్ సీ అప్లికేషన్ నెంబరును నమోదు చేయటం ద్వారా.. అసలు విషయాన్ని గుర్తించటం మరింత తేలిక అవుతుందని చెబుతున్నారు.

ఇకపై అసోంలో ఆధార్ కార్డుల జారీ ఏ మాత్రం సులువు కాదని స్పష్టం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. తమతో పాటు మిగిలిన రాష్ట్రాలు సైతం ఇదే విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఇక.. ఎన్ ఆర్ సీ నమోదు ప్రక్రియలో భాగంగా బయోమెట్రిక్ లో లాక్ అయిన 9.55 లక్షల మందికి కొత్త ఆధార్ కార్డులు ఇస్తామని.. ఆ బాద్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

తమ రాష్ట్రంలో తేయాకు ఉన్న ప్రాంతాల వారికి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. గడిచిన 2 నెలల్లో సరిహద్దుల్లో పలువురు బంగ్లాదేశీయుల్ని అడుగుపెడుతున్న విషయాన్ని గుర్తించి.. ఆ విషయాన్ని బంగ్లాదేశ్ అధికారులకు సమాచారం అందించి.. వారికి అప్పజెప్పినట్లుగా అసోం సీఎం పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్.. దాని మిత్రపక్షాలు ఏ రీతిలో రియాక్టు అవుతాయో చూడాలి.