పాదయాత్రలో రాహుల్ 'డూప్' నిజాలు బయట పెడతా.. సీఎం షాకింగ్ కామెంట్స్
ఒకానొక సందర్భంలో రాజధాని గువాహటిలోకి యాత్రను రాకుండా పోలీసులను ప్రయోగించారు. ఈ క్రమంలో భారీ ఎత్తున బారికేడ్లు అడ్డుపెట్టారు.
By: Tupaki Desk | 29 Jan 2024 3:59 AM GMTవివాదాలకు కేరాఫ్‌గా ఉండే.. అస్సాం ముఖ్యమంత్రి, ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో రాహుల పాల్గొనడం లేదని.. ఆయన విశ్రాంతి తీసుకుంటుంటే.. ఆయన డూప్ పాదయాత్రలో నడుస్తున్నారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయాత్ర ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పూర్తి చేసుకుని పశ్చిమ బెంగాల్‌లో సాగుతోంది. అస్సాంలో యాత్ర జరిగినప్పుడు.. అక్కడి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం హిమంత బిశ్వశర్మ అనుమతులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేసిన విషయం తెలిసిందే.
ఒకానొక సందర్భంలో రాజధాని గువాహటిలోకి యాత్రను రాకుండా పోలీసులను ప్రయోగించారు. ఈ క్రమంలో భారీ ఎత్తున బారికేడ్లు అడ్డుపెట్టారు. దీనిని ఛేదించి మరీ యాత్ర చేస్తామని రాహుల్ ప్రకటించడంతో యాత్రలో ఉన్న కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని.. ముందుకు వెళ్లారు. దీనిపై సీఎం ఆదేశాలతో డీజీపీ కేసు నమోదు చేశారు. అయితే.. అరెస్టు విషయాన్ని మాత్రం మళ్లీ వాయిదా వేశారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఈ కేసులో రాహుల్‌ను అరెస్టు చేస్తామని స్వయంగా హిమంత ప్రకటించారు. ఇదిలావుంటే.. తాజాగా మరోసారి రాహుల్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
''ఆయన రాకుమారుడు, నడిస్తే.. పాదాలు పాలిపోతాయి. అందుకే.. ఆయన రాజదర్బార్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన స్థానంలో ఆయన డూప్.. మరో రాహుల్‌గాంధీ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. ఈ డూప్ పేరు, వివరాలు.. ఎక్కడి నుంచి తీసుకువచ్చారు. ఆయన వయసు అన్నీ నాకు తెలుసు. కానీ, ఇప్పుడు బయట పెట్టను. త్వరలోనే వీటి వివరాలను ఆధారాలతో సహా మీడియాకు అందిస్తా'' అని తాజాగా సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దీనికి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలను కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల కష్టాలు కనిపించవని.. వారి ఓట్లు మాత్రమే కనిపిస్తాయని విమర్శలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ అలెర్ట్ అయింది. ఇలా విషం కక్కడం బీజేపీ నేతలకు మామూలేనని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.