Begin typing your search above and press return to search.

ఫ్లైట్ టికెట్ రూ.349.. ఆఫర్ కాదు అక్కడ ఎప్పుడూ అంతే!

ఆ మాటకు వస్తే దేశంలోని కొన్ని రూట్ల టికెట్ల ధరలు ఎంత తక్కువగా ఉంటాయంటే.. కలలో కూడా ఊహించలేం

By:  Tupaki Desk   |   16 April 2024 4:42 AM GMT
ఫ్లైట్ టికెట్ రూ.349.. ఆఫర్ కాదు అక్కడ ఎప్పుడూ అంతే!
X

నిజమా? అనుకోవచ్చు. కానీ.. ఇది నిజం. ఇదేమీ అరుదైన ఆఫర్ కాదు. ఆ మాటకు వస్తే ఏడాది పొడుగునా కారుచౌక ధరకు విమాన ప్రయాణం చేసే వెసులు బాటు ఉన్న రూట్లు కొన్ని ఉన్నాయి. సాధారణంగా ఫ్లైట్ టికెట్ అన్నంతనే కళ్ల ముందు చుక్కలు కనిపిస్తాయి బాస్ అన్న మాట రావొచ్చు. కానీ.. అన్నిచోట్లకు కాదు. ఆ మాటకు వస్తే దేశంలోని కొన్ని రూట్ల టికెట్ల ధరలు ఎంత తక్కువగా ఉంటాయంటే.. కలలో కూడా ఊహించలేం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మోస్తరు మూవీ టికెట్ మల్టీఫ్లెక్సులో రూ.350కు పైనే ఉంటోంది. క్రేజీ మూవీ అయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వేళలో కేవలం రూ.349 ఖర్చుతో దాదాపు 50నిమిషాల పాటు ఫ్లైట్ జర్నీ చేసే అవకాశం ఉందంటే నమ్ముతారా? అది కూడా మన దేశంలో. మీరు ఒక పట్టాన నమ్మరు. కానీ.. ఇది నిజం. ఆ మాటకు వస్తే రూ.వెయ్యి కంటే తక్కువ ఖర్చుతో దేశంలోని పలు విమాన రూట్లలో ప్రయాణించే వీలుందన్న విషయం మీకు తెలుసా?

అసోంలోని లిలాబరి నుంచి తేజ్ పూర్ మధ్య ప్రయాణం ఏకంగా 50 నిమిషాలు. ఈ దూరానికి వసూలు చేసే విమాన టికెట్ ఎంతో తెలుసా? అక్షరాల రూ.349 మాత్రమే. ఇందులో రూ.150 బేస్ ఛార్జి అయితే.. కన్వినీయెన్స్ ఛార్జీ కింద మరో రూ.199 మాత్రమే వసూలు చేస్తున్నారు. దీనికి మించి మరెలాంటి ఖర్చులు మోపరు. అయితే.. రోజువారీ సర్వీసులు ఉండవు. ఆ మాటకు వస్తే దేశంలోని దాదాపు 20 రూట్లకు పైనే రూ.వెయ్యి కంటే తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాలు చేసే వెసులుబాటు ఉందన్న విషయాన్ని ట్రావెల్ పోర్టల్ ఐక్సిగో వెల్లడించింది.

కేంద్రం అమలు చేస్తున్న ఉడాన్ పథకం కింద.. దేశంలోని అన్ని ప్రాంతాల్ని అనుసంధానం చేసేందుకు వీలుగా కారుచౌకతో విమాన సర్వీసుల్ని నిర్వహిస్తుంటారు. ఈ పథకం కింద విమానయాన సంస్థలకు పలు ప్రోత్సహాకాలు లభిస్తుంటాయి. దీని కారణంగానే కారుచౌక ధరలకు విమాన టికెట్లు లభిస్తుంటాయి. మన దేశంలో ఒక వ్యక్తికి రూ.వెయ్యి కంటే తక్కువ బేస్ చార్జీతో 22 విమాన మార్గాల్లో విమానాలు నడుస్తున్నట్లుగా ఇక్సిగో చెబుతోంది.

ఈశాన్య రాష్ట్రాల్లో ఈ తరహా విమాన సర్వీసుల్ని ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ఇక.. దక్షిణాదిలోనూ కొన్ని రూట్లలో ధరలు కారుచౌకగా ఉంటాయి. ఉదాహరణకు బెంగళూరు - సేలం మధ్య టికెట్ ధర రూ.525 మాత్రమే. కొచ్చి సేలం మధ్య సర్వీసుకూడా తక్కువ ధరకే లభిస్తుందని చెబుతున్నారు. గువాహటి - షిల్లాంగ్ మధ్య బేస్ టికెట్ ధర రూ.400లుగా ఉండటం గమనార్హం.