ఫారిన్ జాబ్ వదిలేసి ఆవుల డైరీ.. కోట్లల్లో టర్నోవర్
పాడి పరిశ్రమపై ఉన్న ఆసక్తితో దేశీ ఆవుల డెయిరీ ఫామ్ ను ప్రారంభించినట్లు చెబుతున్న అసీమ్ రావత్ ఉదంతం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాలి.
By: Tupaki Desk | 20 Feb 2025 4:43 AM GMTఆవుల డెయిరీ ఫామ్.. అన్నంతనే ఎవరో పెద్దగా చదువు సంధ్యలు లేని వారు.. సంప్రదాయంగా వస్తున్న వ్యాపారం చేసేటోళ్లు మాత్రమే చేస్తారనుకుంటారు. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. విదేశాల్లో ఐటీ ఉద్యోగం చేస్తూ.. మంచి శాలరీని వదిలేసి ఆవుల డెయిరీని ఏర్పాటు చేసుకున్న ఆసీమ్ రావత్ గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఈ డెయిరీ ఇప్పుడు మంచిగా నడవటమే కాదు.. కోట్లల్లో టర్నోవర్ సాధిస్తూ అందరిని ఆకర్షిస్తోంది.
పాడి పరిశ్రమపై ఉన్న ఆసక్తితో దేశీ ఆవుల డెయిరీ ఫామ్ ను ప్రారంభించినట్లు చెబుతున్న అసీమ్ రావత్ ఉదంతం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాలి. ప్రస్తుతం ఇతగాడి వద్ద వెయ్యికి పైగా ఆవులతో ఏటా రూ.8కోట్ల టర్నోవర్ చేస్తున్న ఇతను ఇప్పుడు 110 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాదు.. సేంద్రీయ సాగుతో 131 రకాల సహజ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నాడు. అతడు చేస్తున్న క్రషికి కేంద్ర ప్రభుత్వం గోపాలరత్న అవార్డుతో సత్కరించింది కూడా.
ఇంతకూ ఇతడి నేపథ్యం చూస్తే.. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అసీమ్ ఇంజనీరింగ్ చదివాక.. యూఎస్.. యూరోప్ లలో పద్నాలుగేళ్లు ఐటీ ఇంజనీరుగా పని చేశాడు. ఉద్యోగాన్ని వదిలేసిన అతను రెండు ఆవులతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఎన్నో ఇబ్బందులకు గురైనప్పటికి వెనక్కి తగ్గలేదు. నాణ్యత విషయంలో రాజీ పడని వైనం ఇప్పుడు అతన్ని మిగిలిన వారికి భిన్నంగా మార్చటంతోపాటు.. పేరును.. వ్యాపారాన్ని పెంచింది.
ప్రస్తుతం ఇతడి ఫామ్ లో పాలను లీటరు రూ.180 అమ్ముతున్నా కొనేందుకు ప్రజలు వెనుకాడటం లేదు. తన శ్రమకు తగిన గుర్తింపు విషయానికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని చెబుతాడు అసీమ్. మథురలో జరిగిన ఒక కార్యక్రమానికి తనతో పాటు సాహివాల్ జాతికి చెందిన ఆవును తీసుకెళితే.. అక్కడకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు.. తమతో ఫోటో దిగటం తనకెంతో గర్వంగా ఉంటుందని చెబుతాడు. నచ్చిన పని చేయటం..అందులో విజయం సాధించటం ఒక ఎత్తు అయితే.. పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకోవటం మామూలు విషయం కాదు కదా?