సీఎం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్.. అసెంబ్లీలో మాటల యుద్ధం..
ఈ కార్యక్రమంలో పాలకపక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అర్థవంతమైన చర్చ జరిగిందని ఇటు ప్రజలు, అటు పొలిటికల్ అనలసిస్ట్ లు అంటున్నారు.
By: Tupaki Desk | 16 Dec 2023 11:30 AM GMTదాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అసెంబ్లీలో పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షం మాటల యుద్ధాలు వినిపించాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగం తర్వాత ఆమెకు ప్రభుత్వ, ప్రతిపక్షాలు ధన్యవాద తీర్మానం చేశాయి. ఈ కార్యక్రమంలో పాలకపక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అర్థవంతమైన చర్చ జరిగిందని ఇటు ప్రజలు, అటు పొలిటికల్ అనలసిస్ట్ లు అంటున్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలు అర్థవంతమైన చర్చలో పాల్గొనడంతో తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా మారింది. ప్రత్యేక తెలంగాణ సాధనకు కట్టుబడి ఉండడంపై సభలో వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వారి వారి వాదనలు నెగ్గించుకునే ప్రయత్నం చేశారు.
ఇన్నాళ్లు బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో సభలో బీఆర్ఎస్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. కానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొడుతుంటే.. కాంగ్రెస్ నాయకులు సంయమనంతో మాటల యుద్ధంతో వారిని నిలువరిస్తున్నారు. బీఆర్ఎస్ తో పోలిస్తే తామే బెటర్ అని పాలక బెంచ్ లలో కూర్చున్న కాంగ్రెస్ నేతలు వాదనలు వినిపించారు.
తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆ పార్టీ నాయకులు సమర్ధించడం కామనే. కానీ ప్రతిపక్షానికి సరిగా వాయిస్ ఇచ్చేవారు కాదు. కాంగ్రెస్, బీజేపీకి చెప్పుకోతగ్గ సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోవడంతో వారి గొంతు వినిపించకపోవడంతో బీఆర్ఎస్ నిర్ణయాలే పైచేయిగా నిలిచాయి.
ఇప్పుడు సభలో బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని అధికార కాంగ్రెస్ మండిపడగా, అణగారిన వర్గాలపై అణచివేత, నిర్లక్ష్య ధోరణితో నిండిన తెలంగాణలో 'ఇందిరమ్మ రాజ్యం' ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్పుకోవడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుబట్టారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని పాలకవర్గాలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతిపక్షాలతో గౌరవం, తర్కం అంటే ఏమిటో ప్రజలకు అర్థమయ్యే అవకాశం లభించింది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ఇరు పార్టీలు హుందాతనాన్ని పాటించాయని, వ్యక్తి గత ధూషణలకు, అసభ్య పదజాలానికి దిగకుండా సభను అర్థవంతమైన చర్యతో ప్రారంభించి కొనసాగించాయని ప్రజలు చెప్పుకుంటున్నారు.