Begin typing your search above and press return to search.

ఈ ఎంపీలంతా ఈసారి అసెంబ్లీకే!

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ గట్టి కంకణం కట్టుకుంది

By:  Tupaki Desk   |   25 Aug 2023 6:56 AM GMT
ఈ ఎంపీలంతా ఈసారి అసెంబ్లీకే!
X

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ గట్టి కంకణం కట్టుకుంది. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది. ఓవైపు పార్టీలోకి బలమైన నేతలు చేరుతున్నారు. అగ్ర నేతలంతా తమ మధ్య విభేదాలను విడనాడి ఐకమత్యంతో ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్‌ కు అధికారం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయాలు ఉండటంతో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న నేతలంతా ఈసారి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున తెలంగాణలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు.. వారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి (మల్కాజిగిరి), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి), ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (నల్గొండ).

ఈ ముగ్గురిలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి ఓటమిపాలయ్యారు. ఒక్క ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఒక్కరే హుజూర్‌ నగర్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో 2019లో జరిగిన ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా పార్లమెంటుకు పోటీ చేసి గెలుపొందారు.

అయితే ఈసారి ఈ ముగ్గురు నేతలు అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఇప్పటికే రేవంత్‌ రెడ్డి తాను కొడంగల్‌ నుంచే పోటీ చేస్తానని తెలిపారు. మరోవైపు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా తాను, తన సతీమణి పద్మావతి... హుజూర్‌ నగర్, కోదాడ స్థానాల నుంచి బరిలో ఉంటామని స్పష్టం చేశారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం తాను పలుమార్లు గెలుపొందిన నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీరు విజయం సాధించడంపై ఎవరికీ అనుమానాలు లేకపోయినా.. ఇప్పుడు ఎంపీ స్థానాలకు వీరు ఖాళీ చేసే స్థానాల్లో గట్టి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.

తెలంగాణలో మాత్రమే కాకుండా కేంద్రంలోనూ ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో బలమైన నేతలుగా, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తారు కాబట్టి ఎంపీ స్థానాల్లోనూ వీరి స్థాయి అభ్యర్థులను కాంగ్రెస్‌ నిలబెట్టాల్సి ఉంటుంది.

ఇలా గట్టి నేతలు అసెంబ్లీకి పోటీ చేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో లాభించినా మరోవైపు పార్లమెంటు ఎన్నికలకు గట్టి అభ్యర్థులు లభించకపోతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని అంటున్నారు.