పార్టీల ఎన్నికల రాఖీలు.. రాజకీయ సరాగాలు!
ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల మూడ్‌లోకి దాదాపు వెళ్లిపోయింది. మరో రెండు, మూడు మాసాల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి
By: Tupaki Desk | 31 Aug 2023 7:59 AM GMTప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల మూడ్‌లోకి దాదాపు వెళ్లిపోయింది. మరో రెండు, మూడు మాసాల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి ముగియగానే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక విధమైన ఎన్నికల మూడ్ ఆవరించిందనే చెప్పాలి. దీంతో అధికార ప్రతిపక్షాలు.. ప్రజలను మచ్చిక చేసుకునేందు కు.. యడతెగని ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో అంది వచ్చిన అవకాశంగా రాఖీ పండుగను వాడేసుకున్నాయనే చర్చ జరుగుతోంది. కేంద్రంలోని మోడీ సర్కారు మహిళా మణులను మచ్చిక చేసుకుని తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో భాగంగా...కీలకమైన వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గించి.. ఎన్నికల రాఖీని తీసుకువచ్చింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మోడీ సర్కారు ''విశ్వకర్మ'' పథకాన్ని ప్రారంభించి.. బీసీల్లోని ఆవర్గాన్ని బీజేపీవైపు మళ్లించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
చంద్రబాబు రాఖీలు మరిన్ని!
ఇక, ఏపీ విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్తితిలోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న.. గట్టిగా నిర్ణయం కూడా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు రాఖీ సందర్భంగా మహిళలపై వరాల జల్లు బాగానే కురిపించారు. ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే.. ఏటా 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్న ఆయన తాజాగా దీనికి మరొకటి జోడించారు. ఏటా 4 సిలిండర్లు ఇస్తామన్నారు.
ఇక, దీనికి అదనంగా.. బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణంపై చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. నిన్నటి వరకు కేవలం జిల్లాల్లోనే ఉచితప్రయాణం అనుకున్నవారికి.. ఇప్పుడు బాబు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడకైనా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నారు. సొ.. ఇలా రాఖీ వరాల జల్లు కురిసిందన్నమాట.
ఇక, బీజేపీ విషయానికి వస్తే.. ఏపీ బీజేపీ నాయకులు.. ప్రజలకు ప్రత్యక్షంగా ఎలాంటి వరాలు ఇవ్వకపో యినా వారి తరఫున ప్రజా సమస్యలపై పోరాడతామని.. ప్రకటించారు. ఇక, మోడీ ఇచ్చిన రూ.200 గ్యాస్ రాయితీని తమ ఖాతాలో వేసుకుని రాఖీ జల్లుగా ప్రచారం చేస్తుండడం గమనార్హం.