Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ సెకండ్ లిస్టు రెఢీ.. అభ్యర్థులు వీరేనట

అయితే.. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు

By:  Tupaki Desk   |   29 Sep 2023 3:30 PM GMT
బీఆర్ఎస్ సెకండ్ లిస్టు రెఢీ.. అభ్యర్థులు వీరేనట
X

మరో పది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి నిర్వహించాల్సిన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావటానికి ముందే.. అధికార బీఆర్ఎస్ కు సంబంధించిన పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. మొత్తం 119 స్థానాలకు 115 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ తొలి జాబితాను విడుదల చేయటం తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.

ఇలాంటివేళ.. తన కొడుక్కి మెదక్ సీటు ఇవ్వకుండా తనకు మాత్రం మల్కాజిగిరి టికెట్ ను ఫైనల్ చేసిన గులాబీ బాస్ మీద గుర్రుగా ఉన్న మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి.. తన నోటికి పని చెప్పటం తెలిసిందే. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నిన్న (గురువారం)నే కాంగ్రెస్ పార్టీలో చేరటం తెలిసిందే. దీంతో.. మొత్తం ఐదు స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయాల్సి ఉంది.

అయితే.. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. సెకండ్ లిస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని.. కేవలం అధికారికంగా ప్రకటించటమే మిగిలిందన్న మాట జోరుగా వినిపిస్తోంది. మల్కాజిగిరి సిట్టింగ్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు.. 2019లోమల్కాజిరిగి లోక్ సభ స్థానానికి కారు పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిన మర్రి రాజశేఖర్ రెడ్డిని ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.

పెండింగ్ లో ఉంచిన జనగామ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి.. నర్సాపూర్ కు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి.. గోషామహల్ కు నందకిశోర్ వ్యాస్ బిలాల్ పేర్లు ఫైనల్ చేశారని చెబుతున్నారు. మిగిలిన నాంపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థని మాత్రం ఫైనల్ చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఆ స్థానంలో ఫ్రెండ్లీగా పోటీ చేయటమే తప్పించి మరెలాంటి ప్రాధాన్యత ఉండదని చెబుతున్నారు. ఎందుకంటే.. మజ్లిస్ కు చెందిన ఆ స్థానంలో అభ్యర్థిని పోటీకి ఉంచటమే తప్పించి.. పెద్దగా విషయం లేదంటున్నారు. జాబితాను రెఢీ చేసిన కేసీఆర్.. అధికార ప్రకటన చేసేందుకు వీలుగా రంగం సిద్ధం చేశారని చెబుతున్నారు. ఏ క్షణంలో అయినా సెకండ్ లిస్టును ప్రకటిస్తారంటున్నారు.

మరోవైపు.. పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత నుంచి ఇప్పటివరకు 20 మంది వరకు ముఖ్యనేతలు పార్టీని విడిచి వెళ్లటం ఇప్పుడు ఇబ్బందికరంగామారింది. ఇందులో మాజీ మంత్రులు జూపల్లి క్రిష్ణారావు.. తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారుణ్నారు. ఈసారి టికెట్ దక్కని ఎమ్మెల్యేలు రేఖా నాయక్.. రాథోడ్ బాపూరావులతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సైతం పార్టీని విడిచి పెట్టారు. ఇక.. మాజీ ఎమ్మెల్యేలు సైతం కారు దిగేసి.. హస్తం గూటికి చేరుకోవటం ఆసక్తికరంగా మారింది.