ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే!
వచ్చే ఏడాది వేసవిలో పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈలోపు మినీ కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది
By: Tupaki Desk | 6 Oct 2023 8:52 AM GMTవచ్చే ఏడాది వేసవిలో పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈలోపు మినీ కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది. ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో రాజస్థాన్, ఛత్తీసగఢ్ ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక మధ్యప్రదేశ్ లో బీజేపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే లోక్ సభ ఎన్నికల ముందు జరగనున్న ఎన్నికలు కావడం, వీటి ఫలితాలు లోక్ సభ ఎన్నికలపై ఉంటుందనే అంచనాల నేపథ్యమే ఇందుకు కారణం.
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్, మిజోరాంల్లో ఎన్నికల నిర్వహణకు అక్టోబర్ 8-10 తేదీల మధ్య నోటిఫికేషన్ వెలువడుతుందని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ రాష్ట్రాల్లో పోలింగ్ నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ తొలి వారంలోపు ఉండొచ్చని ఈ కథనాలు వెల్లడించాయి.
తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఛత్తీసగఢ్ లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది.
మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17న ముగుస్తుంది. ఇక తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీసగఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల కాలపరిమితి 2024 జనవరిలో వివిధ తేదీల వరకు ఉంది.
ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వరుస సమీక్షలు నిర్వహించింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణకు కూడా వచ్చి ఎన్నికల సన్నద్ధతను పరిశీలించారు. తెలంగాణ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అక్టోబర్ 6న ఢిల్లీలో ఎన్నికల పరిశీలకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేసేలా వ్యూహాలను రూపొందించనున్నారు.
క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయనుంది. ఇందుకోసం పోలీసులు, ఆర్థిక వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనుంది. ఈ సమావేశం తర్వాత తుది ప్రణాళికకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.