తెలంగాణ పోరుకు అన్ని పార్టీలు సిద్ధం.. కాకపోతే టీడీపీ పరిస్థితే!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి
By: Tupaki Desk | 12 Oct 2023 9:48 AM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది.
ఎన్నికల పోరులో ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ అందరికంటే ముందుంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేసింది. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా మరికొద్ది రోజుల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీ, బీఎస్పీ వంటివి కూడా ఎన్నికల గోదాలోకి దిగడానికి సిద్ధమవుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తాము తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి ఆ మేరకు అభ్యర్థులను కూడా ప్రకటించేసింది.
అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటనేది ఇంకా తెలియడం లేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ సీట్లలో గెలుపొందింది.
ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు కాకముందు ప్రకటించారు. ఈ మేరకు ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ అంచనాలకు మించి విజయవంతమైంది. భారీ ఎత్తున ప్రజలు ఈ సభకు తరలివచ్చారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను కూడా నియమించారు. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి క్యాడర్ ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా సీమాంధ్రులు అధికంగా ఉన్నచోట, కమ్మ సామాజికవర్గం అధికంగా ఉన్నచోట టీడీపీకి పట్టు ఉందని అంటున్నారు.
దీనికి తగ్గట్టే చంద్రబాబు సైతం తెలంగాణలో తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని తెలిపారు. సైబరాబాద్, హె టెక్ సిటీ టీడీపీ ప్రభుత్వ చలవేనని వెల్లడించారు.
అయితే ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కావడంతో జైలులో ఉన్నారు. ఇదొక్కటే కాకుండా మరికొన్ని కేసులను కూడా జగన్ ప్రభుత్వం ఆయనపై సిద్ధం చేసింది. ఈ అన్ని కేసులకు సంబంధించి చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. మరోవైపు ఆయన కుమారుడు నారా లోకేశ్ ను అరెస్టు చేయొచ్చని బలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పోటీకి ప్రధాన అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా ఏపీలో అధికారంలోకి రావడమే ముఖ్యమని టీడీపీ భావిస్తోంది. అధికారంలోకి రాకపోతే పార్టీ అడ్రస్ గల్లంతు కావడంతోపాటు జగన్ ప్రభుత్వం కీలక నేతలందరినీ వివిధ కేసులు మోపి జైలుకు తరలిస్తుందని టీడీపీ భయపడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికలపైనే టీడీపీ ప్రధానంగా దృష్టి సారించిందని అంటున్నారు.
తెలంగాణలో ఎన్నికలను ఈసారి లైట్ తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ టీడీపీలోనే ఉన్న రావుల చంద్రశేఖరరెడ్డిలాంటి సీనియర్ నేతలు పార్టీ మారడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు కాసాని జ్ఞానేశ్వర్ కు వృద్ధాప్యం కారణంగా ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన కూడా చురుగ్గా లే రని సమాచారం.