Begin typing your search above and press return to search.

గులాబీ పార్టీ కొంప ముంచనున్న ఆరు హామీలు ...?

కానీ తీరా అవి బలంగా ప్రజలలోకి వెళ్ళిపోవడంతో నాలిక కరచుకుని తాను కూడా వాటినే అనుసరించక తప్పింది కాదని అంటున్నారు

By:  Tupaki Desk   |   30 Oct 2023 5:30 PM GMT
గులాబీ పార్టీ కొంప ముంచనున్న ఆరు హామీలు  ...?
X

బీయారెస్ ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలకు మూడవ సారి వెళ్ళాలనుకుంది. ఆ విధానం ప్రకారమే వెళ్తోంది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం అందులో ఒక కీలకమైన వ్యూహం. అదే విధంగా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి సమయానుకూలంగా ప్రజలకు వరాలు ఇస్తూ పోవచ్చు అనుకుంది. అలాగే చేస్తూ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను మించుతూ బీయారెస్ ఇచ్చిన హామీలు ఇపుడు పెద్దగా ప్రభావం చూపడం లేదని సర్వేలు తేల్చుతున్నాయి.

అదే టైంలో కాంగ్రెస్ ఆరు హామీలే బ్రహ్మాస్త్రంగా పనిచేస్తున్నట్లుగా రుజువు అవుతోంది. అందుకే కాంగ్రెస్ కి ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండమైన అనుకూల గాలి బలంగా వీస్తోంది అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ ఆరు హామీలు కొద్ది నెలల క్రితం ఇచ్చినపుడు బీయారెస్ పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ హామీలను నమ్మేదెవరు అనుకుంది.

కానీ తీరా అవి బలంగా ప్రజలలోకి వెళ్ళిపోవడంతో నాలిక కరచుకుని తాను కూడా వాటినే అనుసరించక తప్పింది కాదని అంటున్నారు. పైగా ఆ ఆరు హామీలను మార్పు చేసి అందులో ఇచ్చిన మొత్తాల కంటే రెట్టింపు కూడా ఇచ్చేలా బీయారెస్ డిజైన్ చేసింది. జనంలోకి వదిలింది. అది జరిగి పదిహేను రోజులు కావస్తున్నా ఆ ఇంపాక్ట్ అయితే పెద్దగా కనిపించడంలేదు అని అంటున్నారు.

ఎందుకంటే కాంగ్రెస్ హామీలను జనం పట్టించుకున్నారు. అధికారంలో ఉన్న పార్టీ హామీలు ఇస్తే ఎపుడూ నమ్మరు. వాటిని గత అయిదేళ్లలో అమలు చేసి ఉండాలి. అంటే బుర్రకు తట్టలేదు లేదా చేసేందుకు మనసు రాలేదు అనే అనుకుంటారు. ఇపుడు అదే తెలంగాణాలో అవుతోందా అన్న చర్చ వస్తోంది. బీయారెస్ ఇచ్చిన హామీల కంటే కాంగ్రెస్ హామీలే పెద్దగా ప్రజలలోకి ప్రచారానికి నోచుకున్నాయి అని అంటున్నారు.

ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూసుకుంటే అర్హులైన మహిళలకు ప్రతీ నెలా 2500 రూపాయల నగదు బదిలీ అలాగే, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, పదిహేను వేల రూపాయల రైతు భరోసా, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి 250 గజాల ఇంటి స్థలం, ఐదులక్షల రూపాయల నగదు, రైతులకు రెండు లక్షల రూపాయల వరకూ రుణమాఫీ వంటివి. ఇక అర్హులైన మహిళలకు పది గ్రాముల బంగారం వంటివి కూడా తెలంగాణా సమాజంలో పాజిటివ్ వేవ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి.

ఇక బీయారెస్ విషయంలో జనాలకు కోపం ఉందని ఉప ఎన్నికలు రుజువు చేశాయి. ఆ మాటకు వస్తే చాలా రిపేర్లు ఆ పార్టీ చేసుకునే చాన్స్ ఉన్నా చేసుకోలేదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుకున్నాయి. ఏది ఏమైనా తెలంగాణాలో రెండు సార్లు వరసగా గెలిచిన బీయారెస్ కి మూడవసారి గెలుపునకు ఆరు హామీలే బ్రేకులు వేస్తున్నాయని అంటున్నారు. అంతే కాదు ముచ్చెటమలు పట్టేలా చేస్తున్నాయని అంటున్నారు.

యాంటీ ఇంకెబెన్సీ పెద్ద ఎత్తున ఉందని అంటున్నారు. దాంతో పాటు ఉద్యోగ వర్గాలలో అసంతృప్తి ఉంది. అదే విధంగా నిరుద్యోగులలో సైతం ప్రభుత్వం పట్ల మంట ఉంది. ఇవన్నీ కూడా ఇపుడు బీయారెస్ జోరుకు బ్రేకులు వేసేలా ఉన్నాయని అంటున్నారు. వీటిని అధిగమించి బీయారెస్ హ్యాట్రిక్ కొడితే కనుక కేసీయార్ అపర చాణక్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అయితే గాలి మారుతోంది. దాన్ని వెనక్కి తిప్పగలరా లేదా అన్నదే చూడాల్సిన విషయం.