Begin typing your search above and press return to search.

ఆ రెండు రాష్ట్రాల్లోనూ ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్‌!

రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి

By:  Tupaki Desk   |   16 Nov 2023 6:16 AM GMT
ఆ రెండు రాష్ట్రాల్లోనూ ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్‌!
X

రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్‌ లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో మధ్యప్రదేశ్‌ లోని మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఛత్తీస్‌ గఢ్‌ లో రెండో దశలో 70 నియోజకవర్గాలకు రేపు (నవంబర్ 17) పోలింగ్ జరగనుంది. తిరిగి డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

అవును... రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇక ప్రధానంగా ఛత్తీస్‌ గఢ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఓటింగ్ జరగనుంది. ఈ క్రమంలో తాజాగా ప్రచార పర్వం ముగియడంతో సభలు, ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారాలు వంటి వాటిపై పూర్తి నిషేధం విధించింది ఎన్నికల సంఘం.

మధ్యప్రదేశ్‌ లో రేపు జరగబోయే 230 స్థానాల్లో మొత్తం 5.6 కోట్లమంది ఓటింగ్ లో పాల్గొననున్నారు. ఇదే సమయంలో ఛతీస్ గఢ్ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరగ్గా, మిగతా 70 స్థానాలకు రెండో దశలో రేపు పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలో కోటి 63 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

2024లో జరగనున్న లోక్‌ సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలను సెమీఫైనల్‌ గా భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో ప్రచారాలను హోరెత్తించేశాయి. ఇందులో భాగంగా... బీజేపీ సీనియర్ నేత అమిత్ షా, అనురాగ్ సింగ్ ఠాకూర్, జేపీ నడ్డా లు ఆ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో రేపు ఈ రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ లో వీరి ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాలి.

మరోవైపు రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార బీఆరెస్స్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. దీంతో 119 స్థానాల్లోనూ బలమైన రసవత్తర పోరు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కొన్ని చోట్ల ద్విముఖ పోటీ ఉండగా.. మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అయితే... 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాజస్థాన్‌ లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ మృతి చెందడంతో 199 స్థానాలకే నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. శ్రీ కరణ్‌ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి.