Begin typing your search above and press return to search.

గెలుపు కోసమే పరుగు.. ఓడుతున్నా ఆగట్లేదు

ఎమ్మెల్యే అనే ఒక్క పిలుపు కోసం.. ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించాలనే ఒక్క కోరిక కోసం ఆ నాయకులు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు

By:  Tupaki Desk   |   26 Nov 2023 11:30 PM GMT
గెలుపు కోసమే పరుగు.. ఓడుతున్నా ఆగట్లేదు
X

ఎమ్మెల్యే అనే ఒక్క పిలుపు కోసం.. ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించాలనే ఒక్క కోరిక కోసం ఆ నాయకులు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో వరుసగా ఓటములు ఎదురవుతున్నా విజయం కోసం పట్టు వదలడం లేదు. ఎన్నికల్లో పోటీ అనేది ఖరీదైన వ్యవహారం. కానీ ఈ నాయకులు మాత్రం వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. ఒక్కసారైనా గెలవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లోనూ ఇలాంటి నాయకుల సంఖ్యకు కొదవే లేదు. పైగా ప్రధాన పార్టీల తరపున వీళ్లు బరిలో దిగారు.

వేములవాడ నియోజకవర్గంలో ఒక్కసారైనా గెలుపు రుచి చూడాలని ఆది శ్రీనివాస్ పోరాడుతున్నారు. కాంగ్రెస్ తరపున ఈ సారి బరిలో నిలిచిన ఆయన.. వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. అయినా మరోసారి విజయంపై ఆశతో పోటీలో నిలబడ్డారు. ఇక మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కీలక నియోజకవర్గం సిరిసిల్లాలో కేకే మహేందర్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా సాగుతున్నారు. 2010 నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ పరాజయం చెందారు. అయినా మరోసారి కాంగ్రెస్ నుంచి కేటీఆర్ ను ఢీ కొడుతున్నారు.

మధిర అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క కోట. ఇక్కడ వరుసగా అతను గెలుస్తూనే ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ ఇక్కడ భట్టిని ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత మూడు సార్లు ఓడిపోయినప్పటికీ మరోసారి రేసులో నిలిచారు కమల్ రాజ్. ఇక ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మూడు సార్లు ఓడిపోయారు. అయినా మరోసారి బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ తో పోటీకి సై అంటున్నారు. మరోవైపు కల్వకుర్తిలో బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి ఇప్పటికే అయిదు సార్లు ఓడిపోయారు. అయినా తగ్గేదే లేదంటూ మరోసారి ఎన్నికల సమరంలో నిలిచాడు. హైదరాబాద్లోని నాంపల్లి నియోజకవర్గంలో మూడు సార్లు ఓడిపోయిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్ నాలుగో సారి కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీకి దిగారు.