తెలంగాణాలో ఓటేస్తే ఏపీలో కట్... వైసీపీ డిమాండ్ ఇదే...!
తెలంగాణాలో పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వేళ ఏపీలో అధికార వైసీపీ ఒక సీరియస్ డిమాండ్ ని తెర మీదకు తెచ్చింది
By: Tupaki Desk | 29 Nov 2023 12:45 PM GMTతెలంగాణాలో పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వేళ ఏపీలో అధికార వైసీపీ ఒక సీరియస్ డిమాండ్ ని తెర మీదకు తెచ్చింది. ఏపీ నుంచి తెలంగాణాలో వెళ్లి అక్కడ సెటిల్ అయి ఓట్లు పొందిన వారికి ఏపీలో ఓటు హక్కు రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు వైసీపీ తరఫున మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలసి వినతిపత్రం అందించింది. అంతే కాదు ఏపీ నుంచి తెలంగాణాకు వెళ్ళి అక్కడ ఓటు హక్కు పొందిన వారి జాబితాను ఆధార సహితంగా ఎన్నికల సంఘానికి అందించింది.
ఏపీకి సరిహద్దు జిల్లాలుగా ఉన్న ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఉంటున్న వారంతా ఏపీ నుంచి చాలా కాలం క్రితమే వెళ్లి కాపురాలు ఉంటున్నారు. వారికి అక్కడే ఓటు హక్కు ఉంది. ఆధార్ కార్డు సహా మొత్తం అడ్రస్ అంతా అక్కడే ఉంది అని వైసీపీ నేతలు అంటున్నారు.
వీరంతా తెలంగాణాలోని కొన్ని నియోజకవర్గాలలో గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో జనాభాగా ఉంటున్నారని ఎన్నికల సంఘం దృష్టికి వైసీపీ నేతలు తీసుకుని వచ్చారు. నిబంధనల ప్రకారం రాజ్యాంగం మేరకు చూస్తే ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని కానీ తెలంగాణాలో ఓటు వేసిన వారు ఏపీలో కూడా ఓటు వేయడానికి పెద్ద ఎత్తున క్యూ కడుతూ వస్తున్నారని వైసీపీ మంత్రులు జోగి రమేష్ మేరుగ నాగార్జున అంటున్నారు.
చాలా మందికి ఏపీ తెలంగాణాలో రెండు చోట్లా ఓట్లు ఉన్నాయని ఇది ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. ఇలాంటి వాటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీలో ఓట్లు కట్ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరామని వారు అంటున్నారు.
ఇక గత ఎన్నికల నాటికే ఏపీలో 16 లక్షలకు పైగా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని వారు ఆరోపించారు. దాన్ని అపుడే ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చామని అన్నారు. భోగస్ ఓట్లు లేకుండా చూడాలని తాము కోరుతూంటే విపక్షాలు దొంగ ఓట్లు వైసీపీ చేర్పిస్తోందని ప్రచారం చేయడం కంటే దారుణం ఉండదని వారు అన్నారు. వైసీపీ ఒక నిబద్ధత కలిగిన పార్టీగా వారు పేర్కొన్నారు.
అందుకే తాము డూప్లికేట్ ఓట్లు రద్దు చేయమని కోరుతున్నామని అన్నారు. తెలంగాణాలో ఓటేసి వచ్చి మళ్లీ ఏపీలో ఓట్లు వేయాలని చూస్తే చట్టపరంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా రెండు ఓట్లు ఉన్నా భోగస్ ఓట్లు ఉన్నా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మొత్తానికి తెలంగాణా ఎన్నికల్లో ఏపీ ఓట్లు చాలా కీలకం అన్నది చాలా రోజులుగా ప్రచారంలో ఉన్న మాట. గ్రేటర్ హైదరాబాద్ లోనే అనేక నియోజకవర్గాలలో ఏపీ నుంచి వెళ్ళిన వారి ప్రభావం ఉంది అని అంటున్నారు. అలాగే ఖమ్మంలో కూడా సగానికి సగం నియోజకవర్గాల్లో అలాగే ఉంది అని చెబుతున్నారు.
మరి ఇంత పెద్ద ఎత్తున ఏపీ నుంచి వెళ్ళిన వారు అక్కడ ఓట్లేస్తారు అని అంతా అనుకుంటున్న వేళ మళ్లీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఏపీలో ఎన్నికలు ఉంటే అక్కడ నుంచి ఊళ్ళకు ఊళ్ళూ ఖాళీ చేసి ఏపీకి తరలి వస్తున్న తీరుని కూడా వైసీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు.
మరి దీని మీద ఎన్నికల సంఘం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి. అంతే కాదు ఇటీవల కాలంలో వైసీపీ దొంగ ఓట్లు చేర్పించింది అంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారానికి ఇది గట్టి చెక్ పెట్టే చర్యగా చూస్తున్నారు. అలాగే ఏపీ సెటిలర్ల ఓట్లు ఇక తెలంగాణాకే ఉండాలి తప్ప మళ్లీ ఏపీలో ఆయా సానుభూతి పార్టీలు వాడుకోరాదని వైసీపీ డిమాండ్ చేస్తోంది. సో ఇపుడు ఏపీలో ఇది సరికొత్త రాజకీయ యుద్ధానికి తెర తీసే విధంగా ఉంది అంటున్నారు.